హైదరాబాద్: సెప్టెంబర్ మాసం జీతాలు చెల్లించాలని కోరుతూ ఆర్టీసీ జెఎసీ హైకోర్టులో మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 16కు వాయిదావేసింది హైకోర్టు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నందున సెప్టెంబర్ మాసం జీతాలను ఆర్టీసీ చెల్లించలేదు.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5 వతేదీ నుండి సమ్మె నిర్వహిస్తున్నారు.ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నందున కార్మికులకు వేతనాలు చెల్లించలేదు. ఈ నెల 6వ తేదీలోపుగా విధుల్లో చేరాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది.ఈ డెడ్‌లైన్ ను కార్మికులు పట్టించుకోలేదు.  1200 కార్మికులు విధుల్లో చేరినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

కానీ, సమ్మెలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు ఎవరూ కూడ విధుల్లో చేరలేదని ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటించారు. ప్రతి నెల ఐదవ తేదీలోపుగా వేతనాలను చెల్లిస్తున్నారు. అయితే  సమ్మెలో ఉన్నందున కార్మికులకు వేతనాలు చెల్లించలేదు.

దీంతో ఆర్టీసీ జేఎసీ నేతలు మంగళవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 16వ తేదీన ఈ విషయమై విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు ప్రకటించింది.

సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా జేఎసీ నేతలు ఆరోపిస్తున్నారు. మరో కార్మికుడు సందీప్ కూడ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్ల బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. ఈ నెల 19వ తేదీన ఆర్టీసీ జేఎసీ తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.