తెలంగాణలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ప్రస్తుతం జిల్లాల నుంచి హైదరాబాద్ వరకే నడుస్తున్నాయి.

అయితే రాజధానిలో బస్సులు నడిచేందుకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. జూన్  8 నుంచి కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడంతో నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు తెరుచుకున్నాయి.

Also Read:మూడు మెడికల్ కాలేజీల్లో కరోనా కలకలం: 600 మంది క్వారంటైన్‌కి తరలింపు

కానీ సిటీ బస్సులు మాత్రం ఇంకా రోడ్డెక్కలేదు. సిటీ, అర్బన్ బస్సులకు అనుమతి ఇస్తే వైరస్ మరింత విస్తరిస్తుందనే అనుమానంతో ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది. అయితే నగరంలో వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు సిటి బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీనికి తోడు మెట్రో రైళ్లు కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో జూన్ 8 నుంచి ప్రభుత్వం సిటీ బస్సులకు అనుమతించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో చర్చిస్తున్నారు.

Also Read:నిమ్స్‌లో కరోనా కలకలం: నలుగురు వైద్యులు, ముగ్గురు ల్యాబ్ సిబ్బందికి కరోనా

మరోవైపు అంతరాష్ట్ర సర్వీసులపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ నగరంలో సిటీ బస్సులను అనుమతించాల్సి వస్తే సామాజిక దూరం పాటించే అవకాశం ఉంటుందా.. ఇందుకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.