హైదరాబాద్‌లో కరోనా వైరస్ కారణంగా గత 6 నెలలుగా డిపోలుగా పరిమితమైన ఆర్టీసీ సిటీ బస్సులు శుక్రవారం నుంచి రోడ్డెక్కనున్నాయి. బస్సులు నడిపేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రేపటి నుంచి హైదరాబాద్ పరిధిలో 25 శాతం సిటీ బస్సులు తిరగనున్నాయి. కరోనా లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో సిటీ బస్సులు ఆరు నెలలకు పైగా డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాల్లో మాత్రం యథావిధిగా తిరుగుతున్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ఇప్పట్లో బస్సులు తిప్పమని పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉండే రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ డిపోల్లో బస్సు సర్వీసులు బుధవారం ప్రారంభమయ్యాయి.

ఈ శివారు డిపోల నుంచి 12 బస్సుల చొప్పున సర్వీసులను నడుపుతున్నారు. ఈ బస్సులు హైదరాబాద్‌ లోపలికి మాత్రం రావు. సిటీ సబర్బన్ ఏరియాకు 15 కి.మీ. దూరంలో బస్సులను నడుపుతున్నారు. నగర శివారు గ్రామాల్లోని ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఇటీవల జరిగిన ఆర్టీసీ సమావేశంలో ‌అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.