హైదరాబాద్‌లోని అఫ్జల్ గంజ్‌లోని సీబీఎస్ బస్టాండ్‌లో చోరీకి గురైన బస్సు ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. నాందేడ్‌లోని ఓ షెడ్డులో బస్సును ధ్వంసం చేస్తుండగా ఆఫ్జల్ గంజ్ పోలీసులు పట్టుకున్నారు.

బస్సును దొంగతనం చేసిన ముగ్గురు వ్యక్తులు పరారవ్వగా.. బస్సును ధ్వంసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి 11 గంటలకు బస్సును సీబీఎస్ బస్టాప్‌లో నిలిపిన డ్రైవర్.. విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లాడు.

అనంతరం మరుసటి రోజు ఉదయం బస్సును తీసేందుకు వచ్చాడు. అయితే అతనికి అక్కడ బస్సు కనిపించకపోవడంతో ఆఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తుప్రాన్ గేట్ వద్ద నుంచి బస్సు నాందేడ్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.