20మంది ప్రయాణికులతో కూడిన ఆర్టిసి బస్ యాక్సిడెంట్... తప్పిన పెను ప్రమాదం
ఆర్టిసి పల్లెవెలుగు బస్సు రోడ్డు ప్రమాదానికి గురయి పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
జగిత్యాల : ప్రయాణికులతో వెళుతున్న ఆర్టిసి పల్లెవెలుగు బస్సు ప్రమాదానికి గురయిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మెట్ పల్లి నుండి ఖానాపూర్ కు 20మంది ప్రయాణికులతో ఆర్టిసి పల్లె వెలుగు బయలుదేరింది. అయితే మార్గమధ్యలో మల్లాపూర్ మండలం మొగిల్ పేట సమీపంలో బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన బస్సు రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. బస్సు ఓ గుంతలో పడిపోవడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
బస్సు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అందులోని వారిని బయటకు తీసారు. అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read More వృద్దురాలిని చీపురుతో చితకబాదిన కసాయి కోడలు... ఎంత అమానుషం..! (వీడియో)
బస్ యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికుల నుండి బస్సు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.