ఆర్టిసి బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న లారీని ఢీకొట్టడంతో 24మంది ప్రయాణికులు గాయపడి హాస్పిటల్ పాలయిన దుర్ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆర్టిసి బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే క్షతగాత్రుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా (nizamabad accident) కు చెందిన ఆర్టిసి బస్సు ప్రయాణికులతో బాల్కొండ వైపు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యింది. బాల్కొండ మండలంలోని బుస్సాపూర్ గ్రామంవద్ద రోడ్డుపక్కన ఆగివున్న లారీని బస్సు డ్రైవర్ గమనించలేకపోయాడు. దీంతో వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సులోని 24మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్ గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను నిర్మల్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారిలో చాలామంది సురక్షితంగా వున్నారని... ఓ ఐదుగురి పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. స్వల్పంగా గాయపడిన వారిని ప్రథమచికిత్స అందించి మరో బస్సులో గమ్యస్థానానికి చేర్చే ఏర్పాటు చేసారు ఆర్టిసి అధికారులు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేక ఇతర కారణాలేమయినా వున్నాయా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రమాదానికి గురయిన బస్సు ముందుభాగా ధ్వంసమవగా, లారీ కూడా స్వల్పంగా దెబ్బతింది. అయితే ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వాటిని రోడ్డుపై నుండి పక్కకు తొలగించారు.