హైదరాబాద్: ఏపీఎస్ఆర్టీసీ విభజన ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగా జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగానే  ఆర్టీసీని విభజించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో వాదించింది.

ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్లపై బుధవారం నాడు మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీసీ విషయంలో ముగ్గురు రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు కోసం హైకోర్టు చేసిన ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం నో చెప్పింది.

Also Read:సుప్రీం రిటైర్డ్ జడ్జిలతో కమిటీ: హైకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న అశ్వత్థామరెడ్డి....

ఇదే విషయాన్ని అడ్వకేట్ జనరల్ తెలంగాణ హైకోర్టుకు వివరించారు. ఆ తర్వాత  ఏపీ పునర్విభజన చట్టంపై చర్చ జరిగింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగానే ఆర్టీసీ విభజన జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది.అయితే కేంద్రం మాత్రం ఆర్టీసీ విభజన విషయంలో ఏపీ పునర్విభజన చట్టం మేరకు విభజన జరగలేదని తేల్చి చెప్పింది.

Also Read: సుప్రీం రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేస్తాం: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు...

ఈ అంశంపైనే కోర్టులో సుధీర్ఘంగా వాదనలు జరిగాయి. మరో వైపు ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీస ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్‌పై విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకొంది.

ఈ విచారణ సందర్భంగా సమ్మె చట్ట విరుద్దమని హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ విషయమై ఈ నెల 18వ తేదీన విచారణ జరిగే అవకాశం ఉంది.హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదనలను విన్పించేందుకు ఇవాళ సమయం పూర్తైంది. దీంతో ఆర్టీసీ కార్మికుల తరపున వాదనలను విన్పించే అవకాశం దక్కలేదని ఆర్టీసీ జేఎసీ నేతలు చెప్పారు.

తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటించారు. ముందుగా ప్రకటించినట్టుగానే తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని నేతలు ప్రకటించారు, నిరసన కార్యక్రమాల్లో భాగంగానే ఈ నెల 18వ తేదీన ఆర్టీసీ జేఎసీ నేతలు సడక్ బంద్ నిర్వహించనున్నారు. 

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెను విరమింపజేసేందుకు హైకోర్టు సుప్రీంకోర్టుకు చెందిన రిటైర్డ్ జడ్జిలను ముగ్గురిని నియమించాలని ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదనకు కూడ తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ కమిటీకి ఆర్టీసీ జేఎసీ నేతలు మాత్రం అంగీకరించారు.