RSS Chief Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని, వారి అంకితభావం వల్లే మనం సంస్థను స్థాపించగలుగుతున్నామని అన్నారు. గురువారం హైదరాబాద్ తార్నాకలో నూతనంగా నిర్మించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ ప్రాంత కార్యాలయం ‘స్ఫూర్తి –ఛాత్రశక్తి’భవన్‌ను ప్రారంభించారు.
RSS Chief Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని, వారి అంకితభావం వల్లే సంస్థ కొనసాగుతుందని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం హైదరాబాద్ తార్నాకలో నూతనంగా నిర్మించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ ప్రాంత కార్యాలయం ‘స్ఫూర్తి –ఛాత్రశక్తి’భవన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఏబీవీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు చాలా త్యాగనిరతులని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ బాగా ప్రాచుర్యం పొందితే, భవిష్యత్తులో కొందరికి అడ్డంకి కావచ్చని, ఈ విషయంపై జాగరూకతతో ఉండాలని సూచించారు.
ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆదరణ పెరుగుతున్న ఈ సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే.. భవిష్యత్తులో ఆ ఆదరణే అడ్డంకిగా మారుతుందని, ఈ విషయంపై జాగరూకతతో ఉండాలని సూచించారు. విజయం గమ్యం కాదు, ఇది ప్రయాణమేనని అన్నారు. తాను తెలంగాణ ఏబీవీపీ క్యాడర్‌తో టచ్‌లో ఉన్నాననీ, ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాష్ట్రంలో మీరు చేస్తున్న పోరాటాన్ని గమనించాననీ, ఇక్కడ ఈ భవనం ప్రారంభోత్సవం సమయంలో ఉద్యమం సానుకూల స్థాయిలో ఉందనే వాస్తవాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు.
సమాజంలో కొంతమంది తాము మాత్రమే సరైన వారని, మిగతా వారందరూ తప్పు అని భావించే వ్యక్తులు ఉన్నారనీ, వారికి వ్యతిరేకంగా జరిగినప్పుడు.. వారు సత్యాన్ని, న్యాయాన్ని అణచివేయడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారని అన్నారు. కానీ సత్యం హింస ద్వారా నాశనం కాదని అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ కార్యకర్త అంటే హేళన చేసేవారని, కానీ, ఇప్పుడు అది నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు.
దేశ సమైక్యత, సమగ్రతల కోసం ఎంతోమంది ఏబీవీపీ నాయకులు తమ ప్రాణాలర్పించారని కొనియాడారు. దేశంపట్ల విద్యార్థులు ప్రేమానురాగాలను పెంపొందించుకోవాలని, అయోధ్యలో రామాలయ నిర్మాణం కంటే గొప్ప ఆనందం, గర్వం ఏముంటుందని భగవత్ అన్నారు. ఒకప్పుడు ఏబీవీపీ కార్యకర్త అంటే సరస్వతిని పూజిస్తాడనే వారని.. కానీ ఇప్పుడు ఆ కార్యకర్త అంటే అఖండ దేశమనే మార్పు వచ్చిందని భగవత్ అభివర్ణించారు.
రాజుల కాలం.. అఖండ భారతాన్ని ఎంతో మంది రాజులు పాలించారు. వారు కొంతకాలం మాత్రమే గుర్తు ఉంటారని, కానీ శ్రీ రాముడు 8 వేల సంవత్సరాల తరువాత.. నేటీకీ పూజలు అందుకుంటున్నారన్నారు. శ్రీ రాముని స్ఫూర్తి, సీత శ్రద్ధ ప్రతి కార్యకర్తలో ఉందని అన్నారు. శ్రీ రాముడు తండ్రి వ్యాఖ్యతో పరిపాలన సాగించారనీ, ఆయన ఆదర్శప్రాయుడు కాబట్టే.. 8 వేల ఏళ్లు అయినా ప్రజలు మర్చిపోలేదని, మనుషుల జీవితంలో రాముడు పరివర్తన తీసుకొచ్చారని మోహన్ భగవత్ అన్నారు.
అనంతరం ఏబీవీపీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఆశీష్ చవాన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ‘స్ఫూర్తి –ఛాత్రశక్తి’భవన్‌ను నిర్మించటం గర్వంగా ఉందన్నారు. విద్యార్థి సమస్యలపై ఏక్తామార్గంలో ఏబీవీపీ సమరశీల పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. సమ్మేళనంలో ఏబీవీపీ అఖిల భారత, రాష్ట్ర నాయకులు ప్రవీణ్‌రెడ్డి, శేఖర్, రాజేందర్‌రెడ్డి, శంకర్, నిధి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శేషగిరిరావు రచించిన ‘దేశ చరిత్ర–పునర్జీవనం–సంస్కృతి’అనే పుస్తకాన్ని మోహన్ భగవత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
