మొక్క కదా అని పీకేస్తే పీక కోస్తా.. అనే ఇంద్ర సినిమాలో ఫేమస్ డైలాగ్ గుర్తింది కదా.. సేమ్ టు సేమ్ అలాంటి ఇన్సిడెంటే పెద్దపల్లిలో జరిగింది. తనింటిముందున్న చెట్టే కదా అని నరికేస్తే యాభైవేలు ఫైన్ కట్టాల్సి వచ్చి లెంపలేసుకున్నాడో వ్యక్తి. 

వివరాల్లోకి వెడితే.. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీలోని సంతోష్‌నగర్‌లో పిడుగు సతీశ్‌ అనే వ్యక్తి తన ఇంటి ముందున్న చెట్టును మూడురోజుల క్రితం నరికేశాడు. దీనికోసం  అనుమతి తీసుకోలేదు. ఆ చెట్టు కొమ్మలు తెగి విద్యుత్‌ తీగలపై పడటంతో షార్ట్‌సర్క్యూట్‌ ఏర్పడి నగరపాలక సంస్థకు చెందిన 25 వీధిదీపాలు కాలిపోయాయి. 

దీంతో మున్సిపల్‌ చట్టం–2019 ప్రకారం రూ.49,500 జరిమానా చెల్లించాలని కమిషనర్‌ పి.ఉదయ్‌కుమార్‌ మంగళవారం సతీశ్‌కు నోటీసు జారీ చేశారు. సతీశ్‌ జరిమానా చెల్లించి మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తానని హామీనిచ్చాడు.

పచ్చదనం పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం విస్తృతంగా చేపడుతూనే, మరోవైపు ఉన్న చెట్లను కాపాడుకునేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఆ చెట్టు తొలగించిన వ్యక్తికి భారీ జరిమానా విధించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలా చోట్ల జరిగాయి.