హైదరాబాద్‌లో కదులుతున్న రైలు కింద పడబోయిన యువతి.. కాపాడిన మహిళా కానిస్టేబుల్ (వీడియో)
హైదరాబాద్‌లోని బేగంపేట రైల్వే స్టేషన్‌లో ఓ యువతి ప్రాణాలను ఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కాపాడారు. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు.
హైదరాబాద్‌లోని బేగంపేట రైల్వే స్టేషన్‌లో ఓ యువతి ప్రాణాలను ఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కాపాడారు. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు. మహిళా కానిస్టేబుల్ యువతిని కాపాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వివరాలు.. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో లింగంపల్లి – ఫలక్‌నూమా ఎంఎంటీఎస్ రైలు బేగంపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అయితే రైలు స్టేషన్ నుంచి బయలుదేరేందుకు సిద్దం కాగా.. సరస్వతి అనే యువతి చివరి నిమిషంలో రైలులోకి ఎక్కేందుకు యత్నించింది.
ఈ క్రమంలోనే బ్యాలెన్స్ కోల్పోయి రైలులో నుంచి.. ప్లాట్‌ఫాం, రైలు మధ్య పడబోయింది. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్క్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) మహిళా కానిస్టేబుల్ సనిత వెంటనే స్పందించారు. యువతి ప్లాట్‌ఫాం, రైలు మధ్య పడిపోకుండా చేతిని పట్టుకుని వెనక్కి లాగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఇందుకు సంబంధించి వీడియోను షేర్ చేసిన ఆర్‌ఫీఎఫ్ ఇండియా.. మహిళా ప్రయాణికురాలని ప్రమాదం నుంచి రక్షించినందుకు సనితకు హ్యాట్సాప్ అని పేర్కొంది. దీంతో పలువురు మహిళా కానిస్టేబుల్ సనితపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక, సనిత స్వస్థలం నల్గొండ జిల్లా. ఆమె 2020 ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.