హైదరాబాద్‌లో దొంగల ఆగడాలు పెరిగిపోయాయి. నిన్న మొన్నటి వరకు ఇళ్లు, బ్యాంకులు, ఏటీఎంలను దోచుకున్న కేటుగాళ్ల కన్ను తాజాగా చారిత్రక సంపదపై పడింది. నిజాం మ్యూజియంలో దోపిడికి పాల్పడి విలువైన బంగారు, వజ్రాలు పొదిగిన వస్తువులను దొంగిలించారు. హైదరాబాద్ పాతబస్తీలోని పురానీహవేలి మస్రత్ మహల్‌ను ఎప్పటిలాగానే ఆదివారం సాయంత్రం మూసివేశారు.

అయితే సోమవారం ఉదయం మ్యూజియం గ్యాలరీ తలుపు తెరిచేసరికి విలువైన వస్తువులు కనిపించలేదు.. గ్యాలరీ వెంటిలేటర్ నుంచి తాడు వేలాడుతూ కనిపించింది. చోరీ జరిగిందని నిర్థారించుకున్న సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. స్వయంగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మ్యూజియానికి చేరుకుని చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించారు.

అపహరణకు గురైన వాటిలో రెండు కిలోల బరువుతో వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్, చెంచా, కప్పు సాసరు ఉన్నాయి. పురాతన వస్తువులు కావడంతో వీటి విలువ రూ. కోట్లలో ఉంటుందని భావిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.