హైదరాబాద్ లో వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసిరిన ఓ కరుడుగట్టిన దొంగ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ సిసిఎస్, చైతన్య పురి పోలీసులు కలిసి సంయుక్తంగా ఈ దోపిడిదొంగ ఆటకట్టించారు. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన అల్లంపురి నాగరాజు(40) వృత్తినిమిత్తం హైదరాబాద్ కు వలసవచ్చాడు. బోరబండలో  నివాసముంటూ ఎస్.ఆర్ నగర్ ఎల్లారెడ్డిగూడ పుట్ పాత్ పై టిఫిన్ సెంటర్ నడిపేవాడు.  అయితే టిఫిన్ సెంటర్ బాగా నడవకపోవడంతో అందుకోసం  పెట్టిన డబ్బులు కూడా వెనక్కిరాలేదు.  ని భావించిన అతడు దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు.

పగటిపూట ఓ స్కూటీపై కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేవాడు.  రాత్రి పూట ఒక్కడే ఆ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడు. ఇలా ఇతడు హైదరాబాద్ తో పాటు కరీంనగర్, కర్నూల్ లలో కూడా పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. 

తాజాగా ఇతడు న్యూ మారుతీనగర్ ప్రాంతంలో రాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించారు. అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా తన నేరాల చిట్టా మొత్తం బైటపెట్టాడు.  నాగరాజు వద్దనుండి 12గ్రాముల బంగారం, అరకిలో వెండితో పాటు ఓ స్కూటీ, సెల్ ఫోన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.