మునుగోడు ఉపఎన్నికలో దూసుకెళ్లిన కారుకు రోడ్డు రోలర్, రోటీ మేకర్‌లు బ్రేకులు వేసినట్టు తెలుస్తున్నది. ఈ గుర్తులు కారును పోలి ఉండటం మూలంగా టీఆర్ఎస్‌కు పడాల్సిన ఓట్లు ఆ గుర్తులకు పడ్డాయని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. అవి కూడా తమ పార్టీకే పడితే మెజార్టీ మరింత ఉండేదని పేర్కొన్నాయి.
హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. కానీ, ఆయన రాజీనామాతో అనివార్యమైన ఉపఎన్నికలో టీఆర్ఎస్ పైచేయి సాధించింది. బీజేపీ స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచింది. హస్తం మూడో స్థానానికి పరిమితమైంది. మునుగోడు ఉపఎన్నికను అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కచ్చితంగా ఇందులో భారీ మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో తమ పార్టీకి రెండు సార్లు అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత దాదాపు లేదని టీఆర్ఎస్ వెల్లడించాలని అనుకున్నది. ఈ గెలుపుతోనే దేశ రాజకీయాల్లోకి దారి వేసుకోవాలని భావించింది. టీఆర్ఎస్ అనుకున్నట్టుగానే విజయం వరించినా.. మెజార్టీ మాత్రం అనుకున్నంతగా రాలేదని గులాబీ నేతలు భావిస్తున్నారు. బలమైన స్థానిక నేతగా ఎదిగిన రాజగోపాల్ రెడ్డి బీజేపీ టికెట్ పై బరిలోకి దిగడాన్ని ఆసరాగా చేసుకుని కమలం పార్టీ కొంత మేరకు పుంజుకుంది. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది.
ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకున్న టీఆర్ఎస్ మెజార్టీ తగ్గడానికి గల కారణాలపై చర్చ జరుగుతున్నది. మునుగోడులో కారుకు రోడ్డు రోలర్, రోటీ మేకర్‌లు బ్రేకులు వేశాయని పలువురు అనుమానపడుతున్నారు. ఇందుకు కారణం.. ఆ రెండు గుర్తులూ కారును పోలి ఉండటమే అని వారు వివరిస్తున్నారు.
Also Read: అక్కడ నోటాకు రెండో స్థానం.. ఇక్కడ కేఏ పాల్‌కు ఓట్లెన్నో తెలుసా?
ఇలాంటి సమస్య ఉంటుందని అధికార పార్టీ కూడా భావించింది. అందుకే ముందుగానే కారును పోలిన గుర్తులను ఇతరులకు ఇవ్వొద్దని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి కూడా చేసింది. ఇక్కడ ప్రజల్లోకి వెళ్లిన పార్టీల ఎన్నికల గుర్తులతో వచ్చిన చిక్కేమీ లేదు. కానీ, రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తులతోనే సమస్య. ఎందుకంటే.. వీరికి కొత్త కొత్త గుర్తులను ఈసీ కేటాయిస్తుంది. ఆ గుర్తులు రాజకీయ పార్టీల గుర్తులతో కొన్ని సార్లు పోలి ఉంటాయి. ఈ ఎన్నికలోనూ కారును పోలిన గుర్తులు ఉన్నాయని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. రోడ్డు రోలర్, రోటీ మేకర్ గుర్తులను కారు గుర్తుగా భావించి పలువురు గులాబీ ఓటర్లు వాటికే ఓటు వేశారని వాదిస్తున్నాయి.
మొత్తం ఉపఎన్నికలో 47 మంది పోటీలో నిలబడ్డారు. 12వ నెంబర్‌లో ఉన్న అభ్యర్థికి చపాతీ మేకర్ గుర్తు ఉన్నది. ఆ అభ్యర్థికి 2,407 ఓట్లు, 14వ నెంబర్‌లో ఉన్న అభ్యర్థి గుర్తు రోడ్డు రోలర్‌కు 1,874 ఓట్లు పడ్డాయి.
Also Read: మునుగోడులో ఓడి గెలిచిన బీజేపీ.. పరాజయం పాలైనా ప్లస్సే.. ఎలాగంటే?
ఈ రెండు గుర్తులకు వచ్చిన ఓట్లు నిజానికి టీఆర్ఎస్ ఓట్లు అని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఆ ఓట్లు కూడా తమ పార్టీకే పడితే మెజార్టీ మరింత పెరిగేదని పేర్కొంటున్నాయి. కాగా, 18వ నెంబర్‌పై ఉన్న అభ్యర్థికీ (చెప్పుల గుర్తు) 2,270 ఓట్లు వచ్చాయి.
