మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట బస్టాండ్‌ వద్ద ఓ ద్విచక్రవాహనదారుడి ఏమరపాటు, మరో ద్విచక్రవాహన దారుడి అతివేగం ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో రెండు వాహనాలు నుజ్జునుజ్జు కాగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు ఎంతగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా, చివరికి భారీ జరిమానాలు విధిస్తున్నా ప్రజలు మాత్రం రోడ్లపై ప్రయాణించేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ శివార్లలోని శామీర్ పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట బస్టాండ్‌ వద్ద ఓ ద్విచక్రవాహనదారుడి ఏమరపాటు, మరో ద్విచక్రవాహన దారుడి అతివేగం ప్రమాదానికి కారణమయ్యాయి.

ఓ వాహనదారుడు వెనుకవైపు చూసుకోకుండానే రోడ్డెక్కి యూటర్న్‌ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో అతివేగంగా వస్తున్న మరో ద్విచక్రవాహనదారుడికి వాహనం అదుపు కాలేదు.. అది గమనించే లోపే ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డు కావడంతో పోలీసులు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.