సనత్ నగర్ లో ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.  పూర్తి వివరాల్లోకి వెళితే.. భరత్ నగర్ కూరగాయల మార్కెట్ సమీపంలో  జగద్గిరిగుట్టకు చెందిన భవన నిర్మాణ కార్మికులు రోడ్డుదాటుతుండగా.. వారిని బస్సు ఢీకొట్టింది. బస్సు కూకట్ పల్లి నుంచి ఎర్రగడ్డ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో కార్మికులు త్రినాథరావు(50), శంకర్ రావు(45) అక్కడికక్కడే మృతి చెందారు. యుగంధర్‌ అనే మరో  వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సంఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేశారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.