భువనగిరి:  యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే  తనయుడు మృత్యువాతపడ్డాడు. గుంటూరు నుండి హైదరాబాద్ కు స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎమ్మెల్యే తనయుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు మాజీ ఎమ్మెల్యే హసన్  అలీ కుమారుడు షేక్ షారూఖ్(22) స్నేహితుడు ఫయాజ్ తో కలిసి స్కూటీపై హైదరాబాద్ కు బయలుదేరాడు. ఈ క్రమంలో భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ ధర్మోజిగూడెం వద్ద హైవే పక్కన వీరు స్కూటీ ఆపారు. బాగా చలి వేస్తుండటంతో స్వెటర్ వేసుకుందామని ఆపగా అదే సమయంలో ఓ కారు అదుపుతప్పి వీరిపైకి దూసుకువచ్చింది. 

ఈ ప్రమాదంలో షారూఖ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి స్నేహితుడు ఫయాజ్ మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.