హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పఠాన్ చెరు మండలం ఇస్నాపూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యాశాఖలో పనిచేసే ఓ ఉద్యోగి మృతిచెందారు. 

హైదరాబాద్ లో కుటుంబంతో కలిసి నివాసముండే మల్లేశం(57) నారాయణఖేడ్ సమీపంలోని కంగ్టి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్(ఎండివో)గా పనిచేస్తున్నారు. ఆయన ఆదివారం తెల్లవారుజామున బైక్ పై హైదరాబాద్ నుండి సంగారెడ్డి వైపు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బైక్ ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మల్లేశం సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.