ఖమ్మంలో ఘోర రోడ్డుప్రమాదాలు.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి...
ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. రెండు లారీలు ఒకదానికొకటి గుద్దుకోవడంతో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందగా, మరో ఘటనలో లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు.
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనల్లో లారీలే ప్రముఖంగా ఉండడం గమనార్హం. మొదటి ఘటనలో జిల్లాలోని వీఏ బజార్ దగ్గర రెండు లారీలు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఎదురుగా వస్తున్న లారీని మరో లారీ ఢీ కొట్టింది. దీంతో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. వాటిలో రెండు లారీల డ్రైవర్లిద్దరూ ఇరుక్కుపోయారు.
బయటికి రాలేక, ఊపిరి ఆడక రెండు గంటలపాటు నరకం చూశారు. కాగా, సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. రెస్క్యూ టీం సాయంతో వారిని రెండుగంటల తరువాత బైటికి తీశారు. కానీ తీవ్రంగా గాయపడడం, ఊపిరిఆడకపోవడంతో బైటికి తీసిన కాసేపటికే వీరిద్దరూ మృతి చెందారు.
మరో ఘటనలో.. ఖమ్మం జిల్లా కొవిజర్ల దగ్గర హోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. పొద్దుటూరు నుంచి విప్పల మడకకుకు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రెండు ప్రమాదాలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.