కరీంనగర్: ఆనందోత్సాహాలతో కూడిన పెళ్లింట రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కరీంనగర్ జిల్లాలో పెళ్లి బృందంతో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ముందు వెళుతున్న ఓ డిసిఎం వ్యాన్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 

పెళ్లి బృందం వరంగల్ జిల్లా హన్మకొండ నుండి మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో జరిగే పెళ్లికి కారులో వెళుతోంది. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న కారు కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఖాదరగూడెం గ్రామ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. డ్రైవర్ కు కారును అదుపుచేయడం సాధ్యం కాకపోవడంతో వేగంగా వెళ్ళి ముందున్న డీసిఎం ను ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయి ఒకరు అక్కడికక్కడే మరణించారు. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. 

వీడియో

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న అంబులెన్స్ క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించింది. విషయం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న మానుకొండూరు పోలీసులు కారులోని  మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.