ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కారుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చిన తరుణంలో తెలంగాణలో ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి స్పందించారు. ఆప్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం ప్రకటించింది ఎన్నికల సంఘం. ఆప్ ఎమ్మెల్యేల పై ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద అనర్హత వేటు వేసినందున అదే నిర్ణయం తెలంగాణలో జరిగిన చట్టవిరుద్ధ నిర్ణయాలపై అమలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.

ఢిల్లీలో జరిగిన రీతిలోనే తెలంగాణలో చట్ట విరుద్ధంగా నియామకాలు జరిగాయన్నారు. గతంలో ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా కేసీఆర్ నియమించారని వివరించారు. ఆ నియామకం చట్ట విరుద్దమని తాను అప్పట్లోనే కోర్టును ఆశ్రయించినట్లు గుర్తు చేశారు. నా వాదన విన్న తర్వాత కోర్టు వాళ్ల నియామకాలను కొట్టేసిందని తెలిపారు. ఆ ఆరుగురు ఎమ్మెల్యేల పై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరారు. రెవెన్యూ రికవరీ కింద వాళ్లుకు చేసిన చెల్లింపులను తిరిగి వసూలు చేసి ఖజానాలో జమ చేయాలన్నారు.

ఈ విషయమై సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని రేవంత్ వెల్లడించారు. తమకు సమాచారం ఇవ్వకుండా భవిష్యత్ లో ఇలాంటి నియామకాలు చేపట్టవద్దని గతంలో కోర్టు చెప్పిందని తెలిపారు. అయినప్పటికీ కోర్టును తప్పుదోవపట్టించేలా మళ్లీ 21 మందికి కేసిఆర్ కేబినెట్ హోదా ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ అంశం కూడా కోర్టులో ఉందన్నారు. ప్రస్తుతం కేబినెట్ హోదా అనుభవిస్తోన్న 21 మందిని తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు.