టిడిపి తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. టిడిపి కలకలంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆచితూచి స్పందించారు. ఒక టివికి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. ఆయన ఏమన్నారో చదవండి.

ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరగాలి. ఇంతకాలం కేసిఆర్ అనుకూలంగా ఏకీకరణ జరిగింది. ఇప్పుడు కేసిఆర్ కు వ్యతిరేకంగా పునరేకీకరణ జరగాలి. దళితులు, బడుగు బలహీన వర్గాలు గౌరవంగా జీవించాలంటే టిఆర్ఎస్ ను ముంచాలి. టిఆర్ఎస్ ను దించాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టిడిపి అనేది ఏదైతే దశాబ్దాల కాలంనాటి ఫిలాసఫీ ఉందో దానికి ఇప్పుడు కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ కు వ్యతిరేకంగా, తెలంగాణలో కేసిఆర్ కు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎపి రాష్ట్రానికి చంద్రబాబు ఉంటే మంచిదని అక్కడి కాంగ్రెస్ నేతలంతా కలిసి బాబుకు మద్దతిచ్చారు. నూటికి నూరుశాతం కాంగ్రెస్ నేతలంతా ఎపిలో బాబుకు మద్దతు ఇవ్వడంతోనే టిడిపి గెలిచింది.

ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు వాళ్ల ఇష్టమొచ్చినట్లు నిర్ణయం తీసుకోవచ్చు.. కానీ టిడిపికి కంచుకోటగా ఉన్న బిసిలు, దళితులు బడుగు బలహీన వర్గాల శ్రేణులు మాత్రం కాంగ్రెస్ వైపు రావాలి. తెలంగాణ టిడిపి కార్యకర్తలెవరూ కేసిఆర్ కు మద్దతు ఇవ్వరు. ఎందుకంటే తెలంగాణలో టిడిపి ని చంపిందే కేసిఆర్. తెలంగాణలో టిడిపి ఉండకుండా విషం చిమ్మిందే కేసిఆర్. టిడిపి మూలాల్లో యాసిడ్ పోసి చంపాలనుకున్న కేసిఆర్ తో కలవాలనుకుంటే నిఖార్సైన టిడిపి కార్యకర్తలెవరూ సాహసం చేయరు. వారికి మనసు ఒప్పదు. కేసిఆర్ తో స్నేహం చేయడం నిజాయితీ కలిగిన టిడిపి కార్యకర్తలకు ఆమోదయోగ్యం కాదు. తెలంగాణ సమాజంలో ఉన్న టిడిపి అభిమానులు, బిసిలు, మాదిగలు కేసిఆర్ నాయకత్వాన్ని ఆమోదించే పరిస్థితి లేదు.

తెలంగాణలో బడుగులు, దళితులు ఆత్మగౌరవంతో బతకాలంటే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలి. టిడిపిలో ఉన్న నాయకులు ఎవరిష్టం వచ్చినట్లు వారు నిర్ణయం తీసుకుంటారు. కానీ.. కేడర్ మాత్రం కాంగ్రెస్ కే మద్దతు ఇస్తారు. టీడీపీ లో నాయకులు వారి పార్టీని టిఆర్ఎస్ లోవిలీనం చేస్తామనటం సరికాదు. వర్గీకరణ అడిగిన మందకృష్ణని జైల్లో పెట్టారు కేసీఆర్. బీసీ లకు ఎన్ని నిధులు కావాలో అన్ని రాసుకోండి అని చెప్పిన కేసీఆర్ కు సబ్ కమిటీ నివేదిక తీసుకునే సమయం కూడా లేదా? ఇంతకంటే బిసిలకు అవమానం ఇంకోటి ఉంటదా?