Asianet News TeluguAsianet News Telugu

కొత్త సచివాలయం ఎందుకు ?

  • నీ కొడుకును సిఎం చేసేందుకేనా కొత్త సచివాలయం
  • వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఆరాటం
  • బైసన్ పోలో గ్రౌండ్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలి
  • 16 మంది సిఎంలకు లేని వాస్తుదోషం మీకే వచ్చిందా?
  • 16 మంది సిఎంల కొడుకులు సిఎంలు కాలేదనే సచివాలయాన్ని మారుస్తారా?
revanth reveals the secret behind new secretariat

తెలంగాణలో కొత్త సచివాలయం కోసం సర్కారు చేపట్టిన చర్యలను తప్పు పట్టారు టిడిపి నేత రేవంత్ రెడ్డి. కొత్త సచివాలయాన్ని ఎందుకు నిర్మించాలనుకుంటున్నారో వివరిస్తూ ఆయన సిఎం కేసిఆర్ కు మరో ఘాటైన బహిరంగ లేఖ రాశారు. కొత్త సచివాయలంతో పాటు అనేక అంశాలను లేఖలో ప్రస్తావించారు రేవంత్. ఆ లేఖలోని అంశాలివి.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి..

“ఏయేటికి ఆ మాట.. ఏ ఎండకు ఆ గొడుగు.. అనే సామెత మీకు సరిగ్గా సరిపోతుంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ వైఫల్యాలను వారు గమనిస్తున్నారని మీరు గుర్తించినప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏదో ఒక కొత్త అంశాన్ని తెరమీదికి తీసుకురావడం అటు ప్రజలతోపాటు ఇటు విపక్షాల దృష్టిని కూడ అటువైపు మళ్లించడం మీకు వెన్నతోపెట్టిన విద్య.. ఇప్పుడు మూడెకరాల భూమి విషయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఇద్దరు దళిత యువకుల ఆత్మహత్యయత్నంతో వెలుగులోకి రావడంతో ఆ విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించకూడదన్న ఉద్దేశ్యంతోనే బైసన్ పోలో మైదానంలో కొత్త సచివాలయ నిర్మాణం చేపడతామంటూ దాని నమూనాను విడుదల చేశారు. ఇప్పటికే 10 ఎకరాల విస్తీర్ణంలో మీరు నివసించడానికి కొత్త గడీని కట్టుకున్న మీరు పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి కేవలం మీ మూఢనమ్మకం కోసం మరో కొత్త సచివాలయం కడతామంటూ ప్రకటించడాన్ని తెలంగాణ సమాజం గర్హిస్తున్నది..” 

 గత ప్రభుత్వాలు నిర్మించిన ఇండ్లు పేద ప్రజలను అవమానించే విధంగా, వారి ఆత్మగౌరవాన్ని భంగ పరిచే విధంగా ఉంటున్నాయని కేవలం ఒకే ఒక్క గదిలో బార్య, భర్త, పిల్లలు జీవించాల్సి రావడం నరకప్రాయమని, ఆ గదిలోనే కోళ్లు, మేకలను కూడ పెంచుకోవాల్సిన దుస్థితిలో పేదలు జీవిస్తున్నారని ఎన్నికల సమయంలో మీరు మొసలి కన్నీరు కార్చారు. ఈ దుస్థితి నుంచి పేద ప్రజలకు విముక్తి కల్గిస్తామని ఇండ్లులేని నిరుపేదలకు 125 గజాల స్థలంలో రెండు పడక గదులు, ఒక హాలు, ఒక వంట గది, ఒక స్నానాల గది, మరుగుదొడ్డి ఉన్న ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని మీ ఎన్నికల మేనిఫేస్టోలో కూడ హామీ ఇచ్చారు. ఈ హామీని నమ్మి ప్రజలు మీకు అందలం ఎక్కించారు. తాజాగా గత ఏడాది జరిగిన జిహెచ్ ఎమ్ సి ఎన్నికలలో కూడ హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే నిర్మిస్తామని, నగరంలోని మురికివాడల స్థానంలో కొత్త నివాసిత ప్రాంతాలను అభివృద్ది చేస్తామని మళ్లీ మీరు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి దాకా ఆ హామీలను మీరు నిలబెట్టుకోలేదు. జిల్లాలు గ్రామీణ ప్రాంతాలలో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించడానికి అవసరమైన స్థలాలు అందుబాటులో ఉన్నా వాటిని కట్టడం గిట్టుబాటుకాక కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదంటూ గత మూడెళ్లుగా మీరు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని పట్టించుకోలేదు. ఇక హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించడానికి అవసరమైన స్థలాలు లేవంటూ ఇండ్ల నిర్మాణాన్ని పక్కనపెడుతూ వస్తున్నారు.

పేద ప్రజలు మాత్రం మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని ఆశగా ఎదురుచూస్తునే ఉన్నారు. కానీ మీరు మాత్రం నగరం నడిబొడ్డున అందుబాటులో ఉన్న స్థలాన్ని డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం కాకుండా కొత్త సచివాలయం నిర్మించడం కోసం తీసుకోవడం పేదల పట్ల, వారి ఆశల పట్ల మీ నిర్లక్ష్యధోరణికి నిదర్శనం. వాస్తవానికి కొత్త సచివాలయ భవన నిర్మాణ అంశాన్ని మీరు రాష్ట్రం కోసం, ప్రజల సౌలభ్యం కోసం కాకుండా కేవలం మీ స్వార్థం కోసం, మీ మూఢ నమ్మకం కోసం తెరమీదికి తెచ్చారనే విషయం తెలంగాణ సమాజానికి తెలియనిదికాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ముఖ్యమంత్రులు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీతో సహా కలిపి ఇప్పటిదాకా 17 మంది ముఖ్యమంత్రులు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న సచివాలయం నుంచే తెలుగు రాష్ట్రాలను పరిపాలించారు. అయితే వారిలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కుమారుడు కూడ మళ్లీ ముఖ్యమంత్రి కావడం జరగలేదని ఆ విధంగా జరగడానికి ప్రస్తుత సచివాలయానికి ఉన్న వాస్తుదోషమే కారణమని అందుకే దాన్ని తొలగించి దానిస్థానంలో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని మీరు మీ సన్నిహితులతో చెప్పుకోవడం అందరికీ తెలిసిందే. కేవలం మీ కుమారుడు కేటిఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతోనే మీరు ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్త సచివాలయాన్ని బైసన్ పోలో మైదానంలో నిర్మించాలని సిద్దమయ్యారనే విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు.

నిజానికి మీ కుమారుడికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత, యోగ్యత ఉంటే దానికి మీరు భయపడే మూఢ నమ్మకాలేవీ అడ్డుకావు. కానీ ఆయనకు ముందుగా పంచాయతీ రాజ్ శాఖను అప్పగిస్తే దానిని ఆగం పట్టించాడు. దాంతో ఆ శాఖను ఆయన నుంచి తొలగించి మరో మంత్రికి మీరే అప్పగించారు. ఇక పురపాలకశాఖ మంత్రిగా పదవి వెలగబెడుతున్న ఆయన ఏ రోజు కూడ ఏ ఒక్క పట్టణాన్ని సందర్శించలేదు, ఏ సమస్యను పరిష్కరించలేదు. పైగా విశ్వనగరం కావాల్సిన హైదరాబాద్ ను చెత్త నగరంగా భ్రష్టుపట్టించిన ఘనత కూడ ఆయనదే. ఐటిలోను ఒరగబెట్టింది ఏమీలేదు గానీ ప్రవేటు సంస్థల నుంచి అవార్డులను అడిగితెచ్చుకొని తనకుతానే గొప్పవాడినని మురిసిపోతున్నాడు. ఆయనను సిఎం చేయాలనుకోవడం అందుకోసం పాతసచివాలయాన్ని పడగొట్టి వందల కోట్ల వ్యయంతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకోవడం మీ మూర్ఖత్వానికి పరాకాష్ట. ఉమ్మడి రాష్ట్రాలను పరిపాలించిన 16 మంది ముఖ్యమంత్రులు ప్రస్తుతం ఉన్న సచివాలయం నుంచి పరిపాలన సాగిస్తే మీరు మాత్రం అందుకు భిన్నంగా ఏ ఒక్క రోజు కూడ సచివాలయానికి రాకుండా మీ ఇల్లు, ఫాంహౌస్ ల నుంచే పరిపాలన సాగిస్తున్నప్పుడు ఇక మీ కొడుకు కోసం కాకపోతే కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఏముందో తెలంగాణ సమాజానికి తెలియజెప్పాల్సిన బాధ్యత కూడ మీ మీద ఉన్నది.  

పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించడానికి అవసరమైన భూమి అందుబాటులో లేదని చెప్పిన మీరు ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని, ఇతర మంత్రులను కలిసి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి అవరమైన భూముల కోసం వారిని అడిగింది లేదు. అదే మీ కొడుకు సిఎం కావడం కోసం మీరు కట్టాలనుకున్న కొత్త సచివాలయానికి బైసన్ పోలో మైదాన భూములను ఇవ్వాల్సిందిగా మీతోపాటు మీ ఎంపీలందరూ కేంద్రాన్ని ప్రాదేయపడడం మీ స్వార్థ ప్రయోజనాల సాధనకోసం మీరు ఎంతగా తపిస్తారనడానికి తార్కాణం. మీరు మీ మూఢనమ్మకం కోసం, మీ కొడుకు కోసం ఉన్న సచివాలయాన్ని పక్కనపెట్టి కేంద్రం నుంచి తీసుకున్న బైసన్ పోలో మైదానంలో కొత్త సచివాలయాన్ని నిర్మించడానికి సిద్దపడితే మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. అందుకే కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకున్న బైసన్ పోలో భూముల్లో పేద ప్రజల కోసం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని చెపట్టాలని తెలుగుదేశం పార్టీ తరుపున మేము డిమాండ్ చేస్తున్నాం. నగరం నడిబొడ్డున ఉన్న బైసన్ పోలో మైదానంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు కడితే ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగు వస్తుంది. అలాకాకుండ మీరు మూర్ఖంగా వ్యవహరిస్తే కోత్త సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రజలు, ప్రజాసంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి కూడ మేము సిద్దంగా ఉన్నాము. నగరంలోని మురికివాడల్లో నరకప్రాయమైన జీవితాలను అనుభవిస్తున్న పేద ప్రజలకు నిలువనీడ కల్పించడానికి మేము ఏ త్యాగానికైనా వెనుదీయబోమని మీకు తెలియజేస్తున్నాము. ఈ నేపథ్యంలోనే మా డిమాండ్లను మీ ముందు పెడుతున్నాము.

 

మా డిమాండ్లు:- 

• మూడ నమ్మకం కోసం బైసన్ పోలో భూముల్లో కొత్త సచివాలయ నిర్మాణ యోచనను విరమించుకోవాలి. 

•  బైసన్ పోలో భూముల్లో నగరంలోని పేదల కోసం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని తక్షణం చేపట్టాలి. 

• రాష్ట్రంలోని అన్ని మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా కేంద్రాలలో తక్షణం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను చేపట్టాలి. 

• డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ముందుకు వచ్చే కాంట్రాక్టర్లకు మాత్రమే ప్రభుత్వానికి సంబందించిన ఇతర నిర్మాణ పనులను అప్పగించాలన్న నిబందన విధించాలి. 

ఈ విషయంలో ప్రభుత్వం నుంచి అనుకూల స్పందన రానిపక్షంలో ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇండ్ల కారణంగా ఉన్న ఇండ్లను కూలగొట్టుకొని నిరాశ్రయులైన నిరుపేదలను, డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకొని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న పేదలతో కలిసి ప్రజాఉద్యమం సాగిస్తామని మీకు తెలియజేస్తున్నాము.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Follow Us:
Download App:
  • android
  • ios