CM Revanth Reddy: నగర పారిశుధ్యంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
CM Revanth Reddy: హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
CM Revanth Reddy: హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నివాస ప్రాంతాలకు దూరంగా నాలుగు వైపులా నాలుగు డంప్ యార్డులను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం మొత్తం జవహర్ నగర్‌లో ఒకే ఒక్క డంప్‌యార్డు ఉంది. జవహర్ నగర్ డంప్ యార్డుకు రోజుకు 8 వేల టన్నుల చెత్త చేరుతోంది.
డంప్‌యార్డు వల్ల వాయుకాలుష్యం, దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు గతంలో శంషాబాద్, మెదక్‌లో కొత్త డంప్‌యార్డు స్థలాలను గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్థానికులకు ఇబ్బంది కలగకుండా స్థలాలను పరిశీలించి ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. చెత్త నుంచి దాదాపు 15 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని, అందుకు అధికారులు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌తో సమన్వయం చేసుకోవాలని కోరారు. చెత్త రీసైక్లింగ్ ప్లాంట్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన తెలిపారు.
మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి
మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ పునరుద్ఘాటించారు. తొలిదశలో 55 కిలోమీటర్ల మేర మెట్రో అభివృద్ది చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ,. రింగ్ రోడ్ టూ రింగ్ రోడ్ మొత్తం ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ తెలిపారు.
మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక డిజైన్లతో అంతర్జాతీయ స్థాయిలో అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఎరియా, షాపింగ్ మాల్స్ లతో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రాత్మక కట్టడాలయిన చార్మినార్, గొల్కొండ, సెవెన్ టూంబ్స్, తారామతి బారాదరి వంటి వాటిని అనసంధానిస్తూ ఒక టూరిజం సర్క్యూట్ ను రూపొందించాలని సూచించారు.
ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పిపిపి మోడల్ లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయం ఆహ్లాదకరంగా గడిపేందుకు సౌకర్యాలు కల్పించేందుకు పరిశీలించాలన్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతంలో చెక్ డ్యాములను నిర్మించి వాటర్ ఫౌంటెన్స్, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఫైవ్ స్టార్ హొటల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకారమందిస్తుందని అన్నారు.
మెట్రో రైలు విస్తరణ
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మెట్రో రైలు విస్తరణ రూట్ డిజైన్‌పై రేవంత్ మరోసారి స్పష్టత ఇచ్చారు. గతంలో గచ్చిబౌలి నుండి విమానాశ్రయం వరకు 32 కి.మీ మేర మెట్రో సేవలను విస్తరించాలని ప్రణాళిక రూపొందించారని, దానివల్ల సామాన్యులకు అంతగా ఉపయోగపడలేదని అన్నారు.
గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో చాలా మంది ధనవంతులు తమ ప్రైవేట్ వాహనాలను వినియోగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. "ప్రతిపాదిత గౌలిగూడ - ఫలక్ నామా - ఎయిర్‌పోర్ట్ మార్గం - ఎల్‌బి నగర్ విమానాశ్రయం మార్గంలో మెట్రో సేవలను ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు.
అరబ్ దేశాల్లో ఉద్యోగాలకు వెళ్లిన తమ కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లే చాలా మందికి ఈ మార్గం ఉపయోగపడుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు.