తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఈ  నేపథ్యంలోనే.. డిసెంబర్ 4వ తేదీన కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ నియోజకవర్గంలో ఎలాగైనా టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. అందులో భాగంగానే ప్రచారానికి ఆయనే రంగంలోకి దిగారు.

దీనిపై కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పందించారు. ఈనెల 4వ తేదీన కేసీఆర్‌ కొడంగల్‌ పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త రోడ్డు మీదకు వచ్చి కేసీఆర్‌ను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

తమ అనుచరుల ఇళ్లపై పోలీసులు అక్రమ దాడులు చేస్తున్నారని, సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. అందుకు నిరసనగా కేసీఆర్‌ పర్యటనను అడ్డుకుంటామని తెలిపారు. తన అనుచరులపై అక్రమ సోదాలు, దాడులకు నిరసనగా 4వ తేదీన కొడంగల్‌ నియోజకవర్గంలో బంద్‌ నిర్వహిస్తామని చెప్పారు.