హైదరాబాద్: గ్లోబరీనా సంస్థకు టెండర్ ఇప్పించింది అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆరేనని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

మంగళవారం నాడు ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.  ఇంటర్‌ బోర్డు నిర్వహణ పూర్తిగా లోపభూయిష్ఠంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.సెంటర్‌ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ను కాదని ఓ ప్రైవేట్‌ సంస్థకు ఇంటర్‌ ఫలితాల బాధ్యతలు ఎలా అప్పగించారని ఆయన ప్రశ్నించారు.

గతంలో  ఒక్కో బాధ్యతను ఒక్కో విభాగానికి అప్పగించే వారు. ఇప్పుడు మాత్రం హాల్‌ టికెట్లు, ముద్రణ, ఫలితాల ప్రకటన అన్నింటినీ గ్లోబరీనాకు అప్పగించారన్నారు.. ఫలితాల ప్రకటన సీజీజీ నిర్వహించినన్ని రోజులూ ఎలాంటి సమస్యలు రాలేదని ఆయన గుర్తు చేశారు.

2016లో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీకి పాల్పడిన  బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆనాడు ఈ టెండర్‌ తీసుకున్నమ్యాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌ సంస్థపై ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంసెట్ పరీక్షల సమయంలో కూడ తప్పిదాలకు పాల్పడిన గ్లోబరీనా సంస్థ ఇంటర్ పరీక్షల్లో  టెండర్లలో పాల్గొనడాన్నిఆయన తప్పుబట్టారు.

గతంలోనే మ్యాగ్నటిక్‌ సంస్థను ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ బోర్డులు నిషేధించినట్టుగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మాగ్నటిక్ , గ్లోబరీనా సంస్థలు కాకినాడ జేఎన్‌టీయూ‌ను మోసం చేశాయని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన గ్లోబరీనా సంస్థకు టెండర్ ఎవరు కట్టబెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.