తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ శాఖ కార్మికులు కీలకంగా వ్యవహరించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సకల జనులు సమ్మె సైరన్ ప్రభావంతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ శాఖ కార్మికులు కీలకంగా వ్యవహరించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సకల జనులు సమ్మె సైరన్ ప్రభావంతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం భూపాలపల్లి కేటీకే 5 గని ఆవరణలో గేట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. సింగరేణి కార్మికులతో ముచ్చటించిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల పొట్ట కొడుతున్నాయని ఆరోపించారు.

బొగ్గుగని కార్మిక సంఘానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్టీసీ కార్మిక సంఘానికి మంత్రి హరీష్ రావు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. కార్మిక సంఘాలపై కేసీఆర్ కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం బొగ్గు గని కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు తాడిచెర్ల మైన్‌‌ను కేసీఆర్ ఎవరికి అప్పగించారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిమా శ్రీనివాస్‌కు లాభం చేకూర్చేందుకు కేసీఆర్ ఈ ఒప్పందానికి సహకరించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సింగరేణి సీఎండీగా శ్రీధర్‌ను కొనసాగించడం వెనక ఉన్న అంతర్యమేమిటో కార్మికులు ఆలోచించాలని కోరారు. సింగరేణిని దివాళా తీయించేందుకు శ్రీధర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

తొమ్మిదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలుగా ఉన్నాయని.. కానీ ఇప్పుడు వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలన్నింటికీ కేసీఆర్ సహకరించారని అన్నారు.