పోలీసులు కాల్పుల్లో ఆర్మీ అభ్యర్థుల మరణానికి కేంద్రానిదే బాధ్యత అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించి.. రాత పరీక్షల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులను.. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం గందరగోళానికి గురిచేసిందన్నారు.
పోలీసులు కాల్పుల్లో ఆర్మీ అభ్యర్థుల మరణానికి కేంద్రానిదే బాధ్యత అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించి.. రాత పరీక్షల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులను.. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం గందరగోళానికి గురిచేసిందన్నారు. నిన్న సికింద్రాబాద్‌లో శాంతియుతంగా నిరసన తెలిపేవారిని పోలీసులే రెచ్చగొట్టేరాని ఆరోపించారు. దేశానికి సంబంధించిన ఇంత పెద్ద నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ ఏకపక్షంగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. విపక్షాలను సంప్రదించకుండా, పార్లమెంట్‌లో చర్చించకుండా నిర్ణయాన్ని ప్రకటిస్తారా? అని మండిపడ్డారు.
మరో 20 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని అన్నారు. పార్లమెంట్‌లో చర్చించాకే మోదీ అగ్నిపథ్ ప్రకటించాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రజలు, అభ్యర్థుల అభిప్రాయాలైనా కేంద్రం తీసుకోవాల్సిందన్నారు. ప్రభుత్వం యువకుల సహనానికి పరీక్ష పెట్టిందన్నారు. మేం చట్టాలు తెస్తాం మీరు తలొంచుకుని అంగీకరించాలన్న తీరుగా మోదీ ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. రోడ్ల మీదకు వస్తున్న లక్షల మంది అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు.
తాను వరంగల్ వెళ్తున్నానని.. ఏఐసీసీ ఆదేశాల మేరకు నిన్న కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నట్టుగా చెప్పారు. రాకేష్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. హింస ఎలాంటి పరిష్కార మార్గం చూపిందని.. యువత తొందపాటు చర్యలకు పాల్పడవద్దని సూచించారు.
ఇక, సికింద్రాబాద్ స్టేషన్ ఘటనపై రైల్వే పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు స్టేషన్‌లోకి దాదాపు 300 మంది ఆందోళనకారులు ప్రవేశించినట్లు తెలిపారు. సాధారణ ప్యాసింజర్ల మాదిరిగా గేట్ నెం.3 నుంచి ఆందోళనకారులు వచ్చినట్లు వెల్లడించారు. స్టేషన్‌లోకి వచ్చీ రాగానే అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని... కర్రలు, రాడ్లతో ఆ వెంటనే 2 వేల మంది ఆందోళనకారులు స్టేషన్‌లోకి ప్రవేశించారని పోలీసులు పేర్కొన్నారు. రైళ్లపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారని.. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినట్లు తెలిపారు.
రైల్వే ట్రాక్‌పై వున్న రాళ్లతో పోలీసులపై నిరసనకారులు దాడులు చేశారని.. మొత్తం 8 రైళ్లపై దాడులకు తెగబడ్డారని వెల్లడించారు. పోలీసు బలగాలు రాగానే ట్రాక్‌పైకి ఆందోళనకారులు పరుగులు తీశారని.. ఆ వెంటనే భద్రతా సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారని వారు తెలిపారు. రాళ్ల దాడిలో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మృతి చెందాడని.. మరో 12 మంది గాయపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైల్వే స్టేషన్‌లో రూ.20 కోట్లు ఆస్తినష్టం సంభించినట్లు ప్రకటించారు.
అంతకుముందు సికింద్రాబాద్ డీఆర్ఎం మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే పార్శిల్ ఆఫీస్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. పార్శిల్ ఆఫీసులో వున్న వస్తువులు ధ్వంసమయ్యాయని.. ఇప్పటి వరకు రూ.7 కోట్ల వరకు ఆస్తి నష్టమైందని డీఆర్ఎం తెలిపారు. పార్శిల్ కార్యాలయంలో వున్న వాహనాలు ధ్వంసమయ్యాయని.. చాలా వరకు ఇన్సూరెన్స్ వుందని, పరిశీలిస్తున్నామని డీఆర్ఎం పేర్కొన్నారు. పలు బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయని ఆయన చెప్పారు. చాలా బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయని.. ఐదు రైల్వే ఇంజిన్లను పూర్తిగా ధ్వంసం చేశారని డీఆర్ఎం వెల్లడించారు. సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని.. దీనిని తాత్కాలికంగా రిపేర్ చేశామని ఆయన పేర్కొన్నారు.
