హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెతో మంత్రుల్లో చీలిక వచ్చిందని  మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. మంగళవారం నాడు ఆయన ఆర్టీసీ సమ్మెపై మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు  ఈనెల 19వ తేదీన తలపెట్టిన బంద్ కు, ఈ నెల 21న తలపెట్టిన ప్రగతిభవన్ ముట్టడికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

సీఎం  కేసీఆర్ ఆర్టీసీ  కార్మికుల సమ్మెపై అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు.ఆర్టీసీ కార్మికుల సమ్మె తప్పు అని మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.

ఓ వైపు ఆర్టీసీ  కార్మికులు ఆత్మహత్యలు చేసుకొంటే టీఎన్‌జీవో నేతలు సీఎం వద్ద భోజనం చేయడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ఆర్టీసీ సమ్మె ను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  ఆయన డిమాండ్ చేశారు.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి  సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సెల్ప్ డిస్మిస్ అయినట్టుగా  సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనతో కలత చెందిన ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ఆర్టీసీ జేఎసీ నేతలు చెబుతున్నారు.

తమ డిమాండ్ల సాదన కోసం సమ్మెను మరింత ఉధృతం చేసే క్రమంలోనే ఆర్టీసీ జేఎసీ నేతలు ఈ నెల 19వ తేదీన రాష్ట్రబంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు  పలు రాజకీయ పార్టీలు మద్దతును ప్రకటించాయి.