హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కు సంబంధించిన ఫామ్ హౌస్ ను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి బెయిల్ లభించింది. దీంతో అతడు చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుండి పోలీస్ వాహనంలోనే జూబ్లీహిల్స్ లోని తన ఇంటికి చేరుకున్న రేవంత్ తనపై దాడికి దిగిన కాంగ్రెస్ సీనియర్లకు చురకలు అంటించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతిపై పోరాటానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ లో తర అరెస్ట్ గురించి లేవనెత్తిన ఎంపీలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు రేవంత్. 

అనంతరం జైల్లో వున్న సమయంలో తనపై విమర్శలు చేసిన సొంతపార్టీ నాయకులకు చురకలు అంటించారు. కేటీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారం తన వ్యక్తిగతం కాదన్నారు. రెండు నెలల క్రితం రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా కేసీఆర్ అవినీతిని బయటపెట్టాలని తనకు బాధ్యతలు అప్పజెప్పారని తెలిపారు. ఆ ఆదేశాలనే తాను పాటించి కేటీఆర్ అక్రమ ఫామ్ హౌస్ గురించి బయటపెట్టానని అన్నారు. 

read more  జైలు నుండి రేవంత్ రెడ్డి విడుదల: పోలీసు వాహనంలోనే ఇంటికి

జన్వాడలో మంత్రి కేటీఆర్ అక్రమ ఫామ్ హౌస్ ను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రజలకు చూపించినట్లు తెలిపారు. కానీ పింక్  మీడియా దాన్ని వక్రీకరించి ప్రసారం చేయడంతో తమ పార్టీ నేతలు కొందరు తెలియకుండానే జరిగింది అన్నారని పేర్కోన్నారు. దాన్ని తాను తప్పుపట్టడం లేదని....ఆ నేతలు మాట్లాడింది కేవలం సమాచార లోపం వల్లే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో, ఏకాభిప్రాయంతో పోరాటం చేసిఉంటే బాగుండేదన్నారు.

''జైల్లో చాలా మంది ఖైదీలు, కానిస్టేబుళ్లు నల్గొండ జిల్లావారే ఎక్కువే. వాళ్ళు నన్ను టిపిసిసి ఉత్తమ్ ఎందుకు రావడం లేదు అని అడిగారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ మీకు కరోన రాలేదుగా సార్... మరి ఉత్తమ్ ఎందుకు రాలేదు'' అని అడిగారని రేవంత్ తెలిపారు.

''నేను టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరింది పదవి కోసమో, డబ్బుల కోసమో కాదు. కేసీఆర్ మీద  పోరాటం చేయాలి అని. కేసీఆర్ పోరాటం చేయడానికి కార్యకర్తలు అందరూ నాయకులపై ఒత్తిడి తీసుకురావాలి. కాంగ్రెస్ అనైక్యత కేసీఆర్ బలం. కాంగ్రెస్ కరోన పార్టీ అయితే టిఆర్ఎస్ ఎయిడ్స్ పార్టీ. 5 నిమిషాల సుఖం కోసం పోతే ఎయిడ్స్ వచ్చి సచ్చిపోతారు. అలాగే 5 సంవత్సరాల పదవికోసం టీఆర్ఎస్ లో చేరితే రాజకీయంగా అలాగే సచ్చిపోతారు'' అని అన్నారు.

read more   కారణమిదే:మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హౌస్ అరెస్ట్

''కేసీఆర్ కేటీఆర్ అవినీతిపై రేపటినుంచి ఆధారాలతో సహా విడుదల చేస్తా. కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా పింక్ మీడియాను చూడకండి బహిష్కరించండి. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు టిఆర్ఎస్ పై పోరాడుతా. ఢీల్లి వెళ్ళను. ఇక్కడే ఉండి టిఆర్ఎస్ పై పోరాటం ఉధృతం చేస్తా'' అని రేవంత్ వెల్లడించారు.