దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.

దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు విశేషమైన స్పందన వస్తుందని చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసానిస్తూ రాహుల్ యాత్ర సాగుతోందని తెలిపారు. 

ఈడీ, సీబీఐ దాడులు చేసినా, తన ప్రాణానికి ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినా రాహుల్ గాంధీ వెనకడుగు వేయకుండా పాదయాత్ర చేపట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికలు, ఓట్ల కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టలేదని చెప్పారు. దేశ విశాల ప్రయోజనాల కోసమే రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనడం తనకు దేవుడిచ్చిన వరం అని రేవంత్ పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం పోతుందని తెలిసి కూడా ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కళను సాకారం చేశారని అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌కు దక్కతుందన్నారు. తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర రేపటితో ముగియనుందని చెప్పారు. రేపు రాహుల్ యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. తెలంగాణలో రాహుల్ పాదయాత్రకు వీడ్కోలు పలికేందుకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూరులో రేపు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సభకు భారీగా జనం తరలిరావాలని పిలుపునిచ్చారు. 

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన రేవంత్ రెడ్డి.. ఉప ఎన్నికపై పూర్తి ఫలితం వచ్చిన తర్వాతే స్పందిస్తామని చెప్పారు.