హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి   మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఘోరంగా  ఓటమి పాలైంది. ఈ ఓటమిని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవికి  రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఈ పదవిలో కొనసాగాలని పార్టీకి చెందిన పలువురు నేతలు విన్నవించినా కూడ రాహుల్ మాత్రం పట్టు వీడడం లేదు.

కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయాలని నాయకత్వం భావిస్తోంది. పార్టీ ఓటమికి  ఎవరూ కూడ బాధ్యత తీసుకోవడం లేని విషయాన్ని  కొందరు నేతలు ప్రస్తావించారు. రాహుల్ గాంధీ మళ్లీ బాధ్యతలను చేపట్టాలని కోరుతున్నా ఆయన ససేమిరా అంటున్నారు. దీంతో  దేశ వ్యాప్తంగా పలువురు పార్టీ నేతలు పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడ తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రయోజనాల కోసమే తాను రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించారు. ఎలాంటి పదవి లేకపోయినా కూడ  పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాహుల్ గాంధీ స్పూర్తితోనే తాను ఈ పదవికి  రాజీనామా చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి పొన్నం ప్రభాకర్ కూడ రాజీనామా చేశారు.