ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Konijeti Rosaiah) భౌతికకాయానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాళులర్పించారు. రోశయ్య భౌతికకాయంపై కాంగ్రెస్ పతాకాన్ని ఉంచిన రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పార్టీ తరఫున నివాళులర్పించారు. 

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Konijeti Rosaiah) భౌతికకాయానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాళులర్పించారు. రోశయ్య భౌతికకాయంపై కాంగ్రెస్ పతాకాన్ని ఉంచిన రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పార్టీ తరఫున నివాళులర్పించారు. అనంతరం రోశయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలే కాకుండా, పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా అమీర్‌పేట‌లోని రోశయ్య ఇంటికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. 

అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ పార్టీ సిద్దాంతాలను నూటికి నూరు శాతం నమ్మి.. ప్రజలకు సేవ చేశారు. ఆయన లేని లోటు తెలుగు రాజకీయాలకు తీరని లోటు. ఇటీవల పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనను కలిసి చర్చించడం జరిగింది. విష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది నాకు సూచనలు చేశారు. ఆయన అనేక పదవులకు వన్నె తెచ్చారు. ఆయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ముఖ్యనేతను కోల్పోవడం జరిగింది. రేపు ఉదయం గాంధీభవన్‌లో 11 గంటలకు ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నట్టుగా తెలిపారు. రోశయ్యకు ఘనమైన నివాళులర్పించాలి’ అని తెలిపారు. తాను తొలిసారిగా అసెంబ్లీ‌లో అడుగుపెట్టిన సమయంలో రోశయ్య తనకు సూచనలు చేశారని గుర్తుచేసుకన్నారు. 

రోశయ్య స్మృతి వనం ఏర్పాటు చేయాలి..
హైదరాబాద్‌లో రోశయ్య స్మృతి వనం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లో స్మృతి వనానికి స్థలం కేటాయించాలని అడిగారు. సీఎం కేసీఆర్ పాజిటివ్‌గా స్పందిస్తారని అనుకుంటున్నట్టుగా చెప్పారు.

రోశయ్య భౌతికకాయానికి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నివాళులు..
రోశయ్య భౌతికకాయానికి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రోశయ్య మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని అన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ,‌ మంత్రి, సీఎంగా పనిచేశారని గుర్తుచేసుకున్నారు. అసెంబ్లీలో ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించారని చెప్పారు. 

రోశయ్య మృతిపై సంతాపం తెలిపిన కాంగ్రెస్ పార్టీ..
రోశయ్య మృతిపై కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. రోశయ్య మృతిపట్ల కాంగ్రెస్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని పేర్కొంది. ప్రజల అభివృద్దికి, శ్రేయస్సు కోసం ఆయన అంకిత భావం ఎల్లప్పుడూ తమకు స్పూర్తినిస్తూనే ఉంటుందని తెలిపింది. ఆయన కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టుగా తెలిపింది. 

రోశయ్య కుమారుడిని ఫోన్‌లో పరామర్శించిన రాహుల్ గాంధీ..
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రోశయ్య మృతిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. రోశయ్య కుమారుడు శివసుబ్బారావును రాహుల్, సోనియాలు ఫోన్‌లో పరామర్శించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

రోశయ్య మృతి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah Death) ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతిచెందారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.