కత్తి పట్టుకుని కాంగ్రెస్ ను దెబ్బతీసే ప్రయత్నం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్

మునుగోడులో మహిళ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించాలని  కోరారు. 
 

 Revanth Reddy Fires On BJP Candidate Komati Reddy Rajgopal Reddy


మునుగోడు: దత్తత తీసుకున్న గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలు  ఏ మేరకు అభివృద్ది చేశారో ప్రజలకు తెలుసునని   టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే  మునుగోడును దత్తత తీసుకంటానని  కేటీఆర్ చేసిన ప్రకటనపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.  

మునుగోడులో  కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ అనంతరం శుక్రవారం నాడు చండూరులో నిర్వహించిన   సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్,కేటీఆర్  దత్తత తీసుకున్న  గ్రామాల్లో ఏం అభివృద్ది చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తాను గతంలో ప్రాతినిథ్యం వహించిన కొడంగల్ లో  కూడా దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.  కానీ  కొడంగల్ రోడ్లపై తట్టెడు మట్టి కూడా పోయలేదని ఆయన  విమర్శించారు. 

కేటీఆర్ పోగానే కేసీఆర్, హరీష్ రావులు వచ్చి ప్రజలకు హామీలిస్తారన్నారు.  కేటీఆర్ ఇచ్చిన హామీల కంటే గొప్పగా కేసీఆర్ హామీలిస్తారన్నారు. కేసీఆర్  ప్రచారం పూర్తికాగానే హరీష్  రావు వచ్చి హామీలిస్తాడన్నారు. మామా ఆణిముత్యం,తాను స్వాతి ముత్యం అంటూ హరీష్ రావు ప్రచారం చేస్తాడని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. 

2018లో ములుగులో సీతక్క గెలిచిందన్నారు. సీతక్కను సమ్మక్కగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి. మునుగోడులో స్రవంతిని గెలిపిస్తే సారక్కగా ప్రజల కోసం పని చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మునుగోడు ప్రజల సమస్యల పరిష్కారం కోసం  అవసరమైతే కేసీఆర్ చొక్కా పట్టుకొని అసెంబ్లీలో నిలదీస్తారని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

బీజేపీఅంటే బఫూన్ పార్టీ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.   2009లో ఎంపీ, 2014 ఎమ్మెల్సీ, 2018లో ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారన్నారు.ఇప్పుడు బీజేపీ అభ్యర్ధిగా మునుగోడు నుండి మళ్లీ తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారన్నారు. ఎంపీగా,ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా రాజగోపాల్ రెడ్డికి  కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పిస్తే  కన్నతల్లి లాంటి పార్టీని వీడి కత్తి పట్టుకుని  ఆ పార్టీని నాశనం చేసేందుకు రాజగోపాల్ రెడ్డి తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని ఆయన కోరారు

also read:మునుగోడు ఉపఎన్నిక.. ఓటర్ల జాబితా పేరుతో బీజేపీ డ్రామాలు, ఓడిపోతే తప్పించుకునేందుకే : పల్లా రాజేశ్వర్ రెడ్డి

 కేంద్రం నుండి మునుగోడు అభివృద్ది కోసం ఎన్ని నిధులు తెచ్చారో రాజగోపాల్ రెడ్డి చెప్పాలని  రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గ్రామాల్లో అమ్ముడు పోయిన సన్నాసులకు సొమ్ములు వచ్చాయని  రేవంత్ రెడ్డి విమర్శించారు.   రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఏమైనా చేశాడా అని ఆయన ప్రశ్నించారు. మునుగోడులో అక్కడక్కడ నేతలు పార్టీలు మారినా  కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం జెండాను వీడలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండా చూసుకొనే తాను మాట్లాడుతున్నట్టుగా చెప్పారు.అసలైన కార్యకర్తలు  కాంగ్రెస్ ను వీడలేదన్నారు.  మునుగోడులో పోటీకి నిలబడిన .మహిళ అభ్యర్ధిని ఓడించేందుకు బీజేపీ, టీఆర్ఎస్  కంకణం కట్టుకుని తిరుగుతున్నారన్నారు. మునుగోడులో స్రవంతిని గెలిపిస్తే సారక్కగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తుందని ఆయన చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios