తెలంగాణ రిజర్వేషన్ బిల్లుపై రేవంత్ ఆగ్రహం
తెలంగాణ అసెంబ్లీలో ఓ చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం తెలిపామని అధికార టీఆర్ఎస్ పార్టీ సంబురపడుతున్న వేళ టీడీపీ ఎమ్మెల్యే రేంవత్ రెడ్డి తనదైన స్టైల్ లో వారికి పంచ్ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అనుమతించకపోవటంపై ఎమ్మెల్యే సండ్ర వెంకటరమణారెడ్డితో పాటు ఆందోళనకు దిగిన ఆయన రిజర్వేషన్ల బిల్లుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
సస్పెన్షన్ వేటు ఉండటంతో సభకు హాజరు కాలేకపోయిన వారిద్దరు రోడ్డుపైనే బైఠాయించారు. అనంతరం ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. ప్రభుత్వ అన్యాయాన్ని ఎండగడుతామనే మమ్మల్ని సభలోకి రానివ్వటం లేదని రేవంత్ ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో బీసీలకు అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్లను ఒకే బిల్లు కింద పెట్టడం పెద్ద కుట్రగా అభివర్ణించారు. సభలో ఆమోదం పొందిన ఎస్టీ, మైనారిటీ బిల్లు మిర్చీ పొట్లాం కట్టుకోడానికి కూడా పనికిరాదని ధ్వజమెత్తారు.
