తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉప్పునూతల నుంచి రెండో రోజు కొనసాగుతోంది. ఉప్పునూతల, గట్టుకాడి పల్లి, కామ్సనూపల్లి, తిరుమలపూర్, డిండి మీదుగా చింతపల్లివరకు రాజీవ్ రైతు బరోసా పాదయాత్ర సాగనుంది. 

ఈ సందర్భంగా గట్టుకాడిపల్లి వద్ద పొలాల్లో పని చేసుకుంటున్న ఆడబిడ్డలతో రేవంత్ రెడ్డి ముచ్చటించారు. కేసీఆర్ ఇచ్చే రైతు బంధుతో ఉపయోగం లేదని.. ఎరువుల ధరలు, అన్ని సరుకుల ధరలు బాగా పెరిగిపోయాయని, కుడి చేత్తే ఇచ్చి ఎడమ చేత్తే తీసుకున్నట్టుందని రేవంత్ రెడ్డి వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట రాజీవ్ రైతు భరోసా దీక్షలో పాల్గొన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు పాదయాత్ర చేయాలనే అనూష్య నిర్ణయాన్ని నిన్న తీసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా దీక్షలో ఆయన పాల్గొన్నారు.

మాజీ ఎంపీ మల్లు రవి, ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు మాట్లాడుతూ.. చేయాల్సింది దీక్షలు కాదని, పాదయాత్రలని అనడంతో రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. నేను అచ్చంపేట నుండే హైదరాబాద్ కు పాదయాత్ర చేస్తాను.. అని వేదిక నుంచే ప్రకటించారు.