తెలంగాణకు టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. 2014కు ముందే ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్‌ను కొన్ని వేలకోట్లు పెట్టి ఖర్చుపెట్టామని టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. 

అంతర్జాతీయ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, పీవీ ఫ్లైఓవర్ బ్రిడ్జి, మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, గోదావరి, కృష్ణా జలాలు.. ఇవన్నీ గత ప్రభుత్వాలు టీడీపీ, కాంగ్రెస్ హయాంలో వచ్చినవేనన్నారు. ఎక్కడైనా ప్రారంభోత్సవాలు పెండింగ్ ఉంటే.. వాటిని ఈ ప్రభుత్వం పూర్తి చేసి గొప్పలు చెబుతోందని విమర్శించారు. నిజాయితీగా ఒక్క నిజం అయినా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెబుతారేమోనని..చూశారని, అలాంటి పరిస్థితి కనిపించలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
వందలాది మంది బలిదానాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని  రేవంత్ రెడ్డి అన్నారు.  కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌కు అది తెస్తున్నాం.. ఇది తెస్తున్నామంటున్నాయని, నిజాం హయాంలోనే హైదరాబాద్‌కు ఎన్నో పెట్టుబడులు వచ్చాయని రేవంత్ అన్నారు. నిజాం కట్టడాలు, పెట్టుబడుల ద్వారా హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ ప్రజలకు టీఆర్ఎస్ చేసిందేమీ లేదని, చెరువులు, పార్కులను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. 

ప్రభుత్వ వైఫల్యం వల్లే హైదరాబాద్‌ను వరదలు ముంచాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.మంత్రి కేటీఆర్ అనుచరులు వందల చెరువులను ఆక్రమించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రపచంలో అత్యధిక అబద్ధాలున్న పుస్తకం.. టీఆర్ఎస్ ప్రగతి నివేదికని, అబద్దాలను ప్రచారం చేస్తూ.. ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌లో 2014కు ముందే ఎన్నో అభివృద్ధి పనులు పూర్తిచేశామన్నారు. కేసీఆర్ సన్నిహితుల కోసం హైదరాబాద్‌లో నాలుగు రోడ్లు వేశారన్నారు. 

ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల హైదరాబాద్ మెట్రోకు రూ.3,500 కోట్ల అదనపు భారం పడిందన్నారు. ఎంఐఎం కోసం గౌలిగూడ వరకు మెట్రోను నిలిపివేసిందన్నారు. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రోను వేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కడతామన్న టీఆర్ఎస్ హామీ ఏమైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

కరోనా కాలంలో సీఎం రిలీఫ్‌ఫండ్‌కు రూ.4వేల కోట్లు వచ్చాయన్నారు. సీఎంఆర్ఎఫ్‌కు వచ్చిన విరాళాలను టీఆర్ఎస్ నేతలు కాజేశారని విమర్శించారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత నాలాల కబ్జాలు పెరిగిపోయాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వందేళ్లలో జరగని ఆక్రమణలు కేసీఆర్ వచ్చిన అరేళ్లలో జరిగాయన్నారు. మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్‌రెడ్డి కాలేజీలు చెరువుల్లోనే ఉన్నాయన్నారు. ఓ మంత్రిగారి వియ్యంకుడి చేతిలో మొత్తం గుట్కా బిజినెస్ నడుస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.