తెలంగాణ  కోసం 1,569 మంది అమరులయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వారి  త్యాగాలను అవమానించేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.

తెలంగాణ కోసం 1,569 మంది అమరులయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వారి త్యాగాలను అవమానించేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. 2014 జూన్ 14 రోజున తెలంగాణ మొదటి శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ 1969లో జరిగిన తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 369 మంది మరణించారని.. మలిదశ పోరాటంలో 1,200 మంది అమరులైనారని.. మొత్తంగా 1,569 మంది అమరులయ్యారని తీర్మానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారని చెప్పారు. ఆరోజు సభలో ఉన్న అన్ని పార్టీలు కూడా ప్రభుత్వం తీర్మానానికి ఆమోదం తెలిపాయి. 

అయితే దీనికి విరుద్దంగా ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అమరవీరుల స్థూపం నిర్మాణం కోసం 2018లో రూ. 63 కోట్లకు టెండర్లు పిలిచారని అన్నారు. ఆ తర్వాత అంచనాలను విపరీతంగా పెంచారని మండిపడ్డారు. అయితే ఒకే కంపెనీ మూడు డమ్మీ టెండర్లు వేసిందని విమర్శించారు. కేటీఆర్‌తో చేరగానే కేసీ పుల్లయ్య కంపెనీ.. కేపీసీ కంపెనీ అయిందని ఆరోపించారు. ఆ కంపెనీ అడ్రస్ తర్వాత విజయవాడకు మారిందని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కిరించునోళ్లను అమరవీరుల స్థూపం నిర్మాణ పనులు అప్పగించారని మండిపడ్డారు. 

అలాగే అమరవీరుల స్థూపం వద్ద 1,569 అమరవీరుల పేర్లను కూడా అక్కడ రాయకపోవడం బాధకరమని అన్నారు. అమరులవీరుల త్యాగాలను కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణ తెచ్చిందనే విధంగా చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అమరవీరులను స్మరించుకునేందుకు వీలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో వచ్చి 9 ఏళ్లు అయినా అమరుల పేర్లు లేవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరవీరుల పేర్లను సువర్ణ అక్షరాలతో రాస్తామని చెప్పారు. అమరుల కుటుంబాలను గౌరవిస్తామని తెలిపారు. అమరులను సమరయోధులుగా గుర్తిస్తామని చెప్పారు.