కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ప్రజాస్వామ్యబద్దంగానే జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికకు సంబంధించిన ఓటర్ లిస్ట్‌కు పీసీసీకి సంబంధం లేదని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ప్రజాస్వామ్యబద్దంగానే జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికకు సంబంధించిన ఓటర్ లిస్ట్‌కు పీసీసీకి సంబంధం లేదని తెలిపారు. ఏఐసీసీ ఎన్నికల డెలిగేట్స్ లిస్ట్ అంత పైనుంచే వస్తుందని చెప్పారు. అక్కడి నుంచి వచ్చిన లిస్ట్ ప్రకారమే ఓటింగ్ జరిగిందన్నారు. తాను కూడా ఒక ఓటర్‌ను మాత్రమేనని.. తాను తన ఓటు వినియోగించుకున్నానని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ అంత పీఆర్వో వాళ్లే చూసుకున్నారని తెలిపారు. అయితే ఎన్నికకు సంబంధించి ఎవరికి అపోహలు ఉన్నా ఏఐసీసీకి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. 

అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఓటర్ లిస్ట్‌లో చివరి నిమిషమంలో మార్పులు చోటుచేసుకున్నాయని కొందరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. జనగామ నియోజకవర్గానికి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి పేరు లేకపోవడంపై మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నిక ఓటర్ లిస్ట్‌పై రేవంత్ రెడ్డి.. ఈ కామెంట్స్ చేశారు. 

మరోవైపు కారు గుర్తును పోలిన 8 గుర్తుల‌ను తొల‌గించాలని కోరుతూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఉప ఎన్నికలో ఫ్రీ సింబల్స్ ఇవ్వద్దనే అధికారం ఎవరికి లేదని అన్నారు. టీఆర్ఎస్ కారు గుర్తునే మార్చుకుంటే సరిపోతుంది కదా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కారు గుర్తు కూడా ఒకప్పుడు ఫ్రీ సింబలేనని అన్నారు. 

ఇక, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాంధీ భవన్‌‌కు వచ్చిన పొన్నాల లక్ష్మయ్య.. అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున పీసీసీ ప్రతినిధులకు ఓటు వేసేందుకు ఏఐసీసీ ఓటర్ కార్డు జారీచేసింది. ఈ క్రమంలోనే జనగామ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, చెంచారపు శ్రీనివాస్ రెడ్డిలకు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో ఇద్దరు నేతలు ఓటు వేసేందుకు గాంధీ భవన్‌కు చేరుకున్నారు. మరోవైపు జనగామ నుంచి తనకు ఓటు వేసే అవకాశం ఉందని కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి కూడా గాంధీ భవన్‌కు చేరుకున్నారు. 

అయితే ఓటరు జాబితాలో అఖరి క్షణాల్లో శ్రీనివాస్ రెడ్డి పేరు తొలగించి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరు చేర్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ రెడ్డి ఓటు వేసేందుకు అనుమతించకపోవడంపై పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఓటు ఇవ్వడంపై పొన్నాల అభ్యంతరం వ్యక్తం చేశారు. 45 ఏళ్ల కాంగ్రెస్ మనిషికి అవమానం జరిగిందని పొన్నాల విమర్శించారు. న్నాలను కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఇతరులు సముదాయించారు. ఈ పరిణామంపై పొన్నాల లక్ష్మయ్య తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనతో జనగామ నియోజకవర్గం కాంగ్రెస్‌లో గత కొంతకాలంగా చోటుచేసుకున్న వర్గ విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి.