కొడంగల్ లో నెలకొన్న చిన్న వివాదం పెద్ద దుమారమే రేపుతోంది. కాంగ్రెస్, పోలీసు వర్గాల మధ్య తోపులాటకు దారి తీసింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణుల అరెస్టుకు దారి తీసింది. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలంలో ఉన్న నందిగామ గ్రామంలో బిటి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఉదయం 9.30 గంటలకు ఉంది. దీనికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. వారితోపాటు స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, స్థానిక సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పీటిసిలు కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ఉన్నందున తొమ్మిదిన్నరకే రేవంత్ తన అనుచరగణంతో అక్కడికి చేరుకున్నారు. ఉదయం పదకొండున్నర వరకు కూడా మంత్రులు రాలేదు. అయితే మంత్రులు వస్తారా? లేదా తామే కార్యక్రమం ప్రారంభించాలా అని రేవంత్ పోలీసులను అడిగారు. దీంతో మరో పది నిమిషాల్లో మంత్రులు చేరుకుంటారని పోలీసులు సమాధానమిచ్చారు.

అయితే పది నిమిషాల్లో కూడా మంత్రులు రాలేదు. దీంతో బిటి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని సర్పంచ్, ఎంపిటిసిల చేత రేవంత్ కొబ్బరికాయ కొట్టించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ వర్గాలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మంత్రులు వచ్చే వరకు ఆగాల్సిందేనని పోలీసులు పట్టుపట్టారు. అయితే తాను కూడా ప్రజాప్రతినిధినే అని రేవంత్ బదులిచ్చారు. అనుకున్న సమయానికి రాకపోతే ఆగాలా అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. బిటిరోడ్డు శంకుస్థాపన కార్యక్రమం మొదలు పెట్టే ప్రయత్నంలో సర్పంచ్, ఎంపిటిసి ఉన్న సమయంలో తోపులాట జరిగింది. ఆ సమయంలో స్థానిక సిఐ శిలాఫలకం మీద పడిపోయాడు. దీంతో శిలాఫలకం కూలిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు బలగాలు కాంగ్రెస్ కార్యకర్తలను దొరికినోళ్లను దొరికినట్లే అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో ఆయన అక్కడినుంచి టూ వీలర్ మీద ఎస్కేప్ అయ్యారు. రేవంత్ ప్రస్తుతం కొడంగల్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వాహనాలను కోయిల్ కొండ పోలీసు స్టేషన్ కు తరలించారు.

రేవంత్ వెళ్లిపోయిన తర్వాత మంత్రులిద్దరూ నందిగామ గ్రామాన్ని సందర్శించారు. శిలాఫలకం కూలగొట్టిన ఘటనలో కారకులైన వారిని అరెస్టు చేయాలని స్థానిక టిఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకం ధ్వంసం అయిన ఘటనపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

కొడంగల్ లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. కొడంగల్ రోడ్డు శంకుస్థాపన వివాదం వీడియో కింద ఉంది చూడొచ్చు.