Asianet News Telugu

నాడు రేవంత్ .. నేడు బాల్క సుమన్

  • అధినేతలకు తలనొప్పులు తెచ్చి పెడుతున్న కింది స్థాయి లీడర్లు
  • మొన్న ఓటు కు నోటు కేసులో బాబును ఇరికించిన రేవంత్ 
  • నేడు పవర్ విషయంలో కేసిఆర్ కు ఇరకాటం తెచ్చిన బాల్క సుమన్
  • రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
Revanth and balka suman creat problems naidu and kcr
  • Facebook
  • Twitter
  • Whatsapp

నాడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో చిక్కడంతో అప్పుడు టిడిపి అధినేతగా ఉన్న చంద్రబాబు తీవ్రమైన చిక్కుల్లో పడ్డారు. ఆ కేసు ఇంకా ఇటు రేవంత్ కు అటు చంద్రబాబు మెడకు వేలాడుతూనే ఉన్నది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి జైలుపాలయ్యారు. బాబు మాత్రం జైలుకు పోలేదు.

సీన్ కట్ చేస్తే.. అదే తరహాలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన తీవ్రత రేవంత్ రెడ్డి చంద్రబాబు ఓటు నోటు స్థాయి అంతటి తీవ్రత కలిగింది కాకపోయినా... పరిణామాలు మాత్రం అలాగే ఉన్నాయి. తెలంగాణ సర్కారు విద్యుత్ విషయంలో లేని గొప్పలు చెప్పుకుంటున్నదని సర్వత్రా విమర్శలున్నాయి. ఏదో పది ఇరవై తెలుగు, తెలంగాణ పత్రికల్లో యాడ్స్ వేసుకుంటే ఎవరూ పెద్దగా వ్యతిరేకించేవారు కాదు. దేశంమొత్తంలో అనేక రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్ తమ గొప్పతనమే అంటూ కోట్లకు కోట్లు ఖర్చు చేసి యాడ్స్ వేయించుకోవడం భారీ స్థాయిలో వివాదాస్పదమైంది. సంబంధం లేని భాషల్లో యాడ్స్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ పత్రికల్లోనూ యాడ్స్ ప్రత్యక్షమయ్యాయి. విచ్చలవిడిగా 24 గంటల విద్యుత్ పేరుతో యాడ్స్ ఇచ్చి తెలంగాణ సర్కారు విమర్శలపాలైంది.

ఇక ఈ విషయంలో తెలంగాణ సర్కారు గొప్పలన్నీ ఉత్తవేనని.. 24 గంటల విద్యుత్ పేరుతో తెలంగాణ సర్కారు జనాలను నిలువునా ముంచుతున్నదని రేవంత్ రెడ్డి గాంధీభవన్ లో మీడియా ముందు ఏవేవో లెక్కలు చెప్పారు. ఈ విషయంలో కేసిఆర్ సర్కారు జనాలను ముంచుతుందన్నారు. దీనిపై టిఆర్ఎస్ ఎంపి బాల్క సుమన్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అంతటితో ఆగితే బాగానే ఉండేది.. ఇంకో మెట్టెక్కి దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు చర్చకు రా.. చర్చకు వచ్చి సర్కారు వైఫల్యాలను నిరూపించు.. లేకపోతే ఆబిడ్స్ రోడ్డు మీద ముక్కు నేలకు రాయి అని సవాల్ విసిరారు. నువ్వు చర్చకు ఎవరెవరిని తెచ్చుకుంటవో తెచ్చుకో.. టిఆర్ఎస్ నుంచి నేను, ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి వస్తాం అని సవాల్ చేశారు. ఈ సవాల్ ను రేవంత్ రెడ్డి క్షణాల్లో స్వీకరించారు. మేము చర్చకు రెడీ.. ఎవరెవరరు వస్తారో అన్నారు కదా.. తనతోపాటు ఎమ్మెల్యే సంపత్ కుమార్, పిసిసి నేత డాక్టర్ దాసో శ్రవణ్ వస్తామని స్పందించారు.

రేవంత్ రెడ్డి ఏమాత్రం స్పందించడనుకుని సుమన్ సవాల్ చేశారు.. కానీ సుమన్ సవాల్ ను రేవంత్ స్వీకరించేసరికే టిఆర్ఎస్ శిబిరంలో కలవరం మొదలైంది. ఏం చేద్దాం.. ఏం చేద్దాం... అని తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. సుమన్ పెద్ద డైలాగులు.. పెద్ద పెద్ద సవాళ్లు అధినేత కేసిఆర్ దగ్గరికి పోయింది. ఇక్కడ తేడా వస్తే.. సుమన్ ఒక్కడే బద్నాం అవుడు కాదు.. ఏకంగా టిఆర్ఎస సర్కారే బద్నాం అవుతుందని టిఆర్ఎస్ లో ఆందోళన మొదలైంది. ఈ విషయంలో పిచ్చి సవాళ్లు ఎందుకు చేశారని సుమన్ అండ్ బ్యాచ్ కు అధినేత కేసిఆర్ నుంచి అక్షింతలు కూడా పడ్డట్లు ప్రచారం సాగింది.

ఈ వివాదం నుంచి ఎట్లా గట్టెక్కాలా అని ఆలోచించిన టిఆర్ఎస్ కొత్త పల్లవి అందుకుంది.  మేము చర్చలకు సిద్ధమే కానీ... రేవంత్ వస్తే మేం చర్చలకు రాబోము అంటూ సుమన్ నోటికొచ్చినట్లు రేవంత్ మీద తిట్ల దండకం ఎత్తుకున్నారు. రేవంత్ దొంగ.. పట్టపగలు నోట్లతో దొరికిండు. జైలుకు పోయి విశ్వసనీయత పోగొట్టుకున్నడు అంటూ ఎడా పెడా విమర్శలు గుప్పంచారు.

అయితే ముందుగా సవాల్ విసిరి.. తర్వాత తోక ముడిచారెందుకని రేవంత్ ప్రతిస్పందించారు. దీంతో టిఆర్ఎస్ పార్టీ తిట్ల పురాణం లంకించుకున్నది కానీ.. ఈ విషయంలో పైచేయి సాధించలేకపోయింది. రేవంత్ పట్టించుకుంటాడా అన్నట్లు ఏదో అన్యమనస్కంగా బాల్క సుమన్ సవాల్ చేసిన మాట వాస్తవమే కానీ.. రేవంత్ స్పందిస్తాడని తమకేం తెలుసు అని టిఆర్ఎస్ నేతలు అంతర్గత సంభాషనల్లో అంటున్నారు. సుమన్ సవాల్ చేసిన మరుక్షణమే రేవంత్ స్పందించి దాన్ని స్వీకరించి టిఆర్ఎస్ ను మెసలనీయకుండా చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మొత్తానికి సుమన్ చేసిన చిన్న సవాల్ ఎంటైర్ టిఆర్ఎస్ ను ఇరకాటంలో పడేసిందని చెబుతున్నారు.

అంతేకాదు తెలంగాణలో తిరుగులేని నేతగా చెలామణి అవుతున్న కేసిఆర్ కు సైతం సుమన్ సవాళ్ళ అంశం తలనొప్పి తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. గతంలో ఏరకంగా ఆవేశంగా నోట్ల కట్టలు పట్టుకుని తిరిగి రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్ అయి చంద్రబాబును బోనులో నిలబెట్టాడో.. అదే తరహాలో ఉత్త పుణ్యానికే బాల్క సుమన్ కేసిఆర్ ను ఇరికించేశాడని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మాటల మాంత్రికుడిగా పేరున్న కేసిఆర్ ను చిన్న విషయంలో సుమన్ ఇరికించడంతో పార్టీలో హాట్ టాపిక్ అయింది. ఎంపి సుమన్ తొందరపాటు సవాళ్లు చేసి పార్టీ ఇజ్జత్ తీసేసిండని కార్యకర్తలు చెబుతున్నారు.  మొత్తానికి నాడు రేవంత్ ఎట్లైతే.. చంద్రబాబును ఇరకాటంలో పడేసిండో.. అదే తరహాలో నేడు బాల్క సుమన్ టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను ఇరకాటంలో పడేసిండని తెలంగాణ రాజకీయ పండితులు విమర్శలు షురూ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios