నల్గొండ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వరద నీటితో రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు నిండు కుంటల్లా మారాయి. ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ ఎడమ కాలువలో సరదాగా ఈతకు దిగిన మాజీ ఐఎఎస్ అధికారి తనయుడు ప్రమాదవశాత్తు నీటమునిగి మృత్యువాతపడ్డాడు. ఈ విషాద సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... నల్గొండ పట్టణంలో  రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అతడికి ఇద్దరు కొడుకులు కాగా పెద్ద కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు. చిన్న కుమారుడు శ్రవణ్ కుమార్ మాత్రం పోటీ పరీక్షలకు సన్నద్దమవుతూ కుంటుంబంతో కలిసి వుంటున్నాడు.  

అయితే శ్రవణ్ తరచూ ఈత కొట్టడానికి నాగార్జున సాగర్ ఎడమ కాల్వ వద్దకు వెళ్లేవాడు. ఈ క్రమంలోనే భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా ఇటీవల అతడు సరదాగా ఈతకు వెళ్లాడు. కానీ నీటి ఉదృతి అధికంగా వుండటంతో ప్రమాదవశాత్తు నీటమునిగి అతడు గల్లంతయ్యాడు. అతడి మృతదేహం త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి చెరువులో లభ్యమయ్యింది. 

మృతదేహాన్ని బయటకు తీయించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.