భూపాలపల్లి మోరంచపల్లిలో మొదలైన రెస్క్యూ ఆపరేషన్...
వరదలో చిక్కుకుపోయిన మోరంచపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ మొదలయ్యింది. ఫైర్ డిపార్ట్ మెంట్ మోరంచపల్లికి చేరుకుంది. గ్రామస్తులను రెస్క్యూ చేస్తోంది.
జయశంకర్ భూపాలపల్లి : ఎట్టకేలకు మొరంచపల్లి గ్రామంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమయ్యిది. ఫైర్ డిపార్ట్మెంట్ మోరంచపల్లి గ్రామానికి చేరుకుంది. నీళ్లలో చిక్కుకుపోయిన గ్రామస్తులను రెస్క్యూటివ్ రక్షిస్తోంది. 200కు పైగా ఇళ్లల్లోకి వరద నీరు చేరుకుంది. వెయ్యిమంది గ్రామస్తులు వరదలో చిక్కుకున్నారు. భూపాలపల్లి-పరకాల జాతీయ రహదారిపై ఆరు అడుగుల ఎత్తులో వరదనీరు ప్రవహిస్తోంది.
ఇదిలా ఉండగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొరంచపల్లి గ్రామం జలదిబ్భంధనంలో చిక్కుకుంది. గ్రామంలోని వెయ్యిమంది ప్రజలు ఈ వరద చుట్టుముట్టడంతో.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
గ్రామానికి సమీపంలో ఉన్న మొరంచవాగు పొంగిపొర్లడంతో వరద నీరు గ్రామంలోకి ఉదృతంగా వచ్చేసింది. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వరద ఉధృతి పెరగడంతో ఒకసారిగా మేల్కొన్న ప్రజలు హాహాకారాలు చేశారు. వెంటనే వరదలో కొట్టుకుపోకుండా ఇళ్లమీదికి ఎక్కి.. తమని తాము కాపాడుకుంటున్నారు. కాగా, క్షణక్షణానికి వరద నీరు పెరుగుతుండడంతో ప్రాణభయంతో కాపాడమంటూ వేడుకుంటున్నారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్లతో తమను రక్షించాలని మోరంచ గ్రామ ప్రజలు కోరుతున్నారు. వరద నీరు భారీగా చేరుకోవడంతో బిల్డింగ్ లకు పైకి ఎక్కి ప్రాణాల రక్షించుకుంటున్నారు. మోరంచవాగు వరద ప్రవాహం గ్రామంలో ఆరు ఫీట్ల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో వరద నీటిలో ఇండ్లు తేలియాడుతున్నట్లుగా కనిపిస్తోంది.
రాత్రి పడుకునే సమయంలో ఇంత వరద లేదని.. తెల్లారేవరికి వరద చుట్టుముట్టిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి తాము సహాయం కోసం ఎదురుచూస్తున్నామని.. ఇప్పటి వరకు ఎవరు తమను రక్షించడానికి రాలేదన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ సహాయం కోసం ఎదురుచూస్తున్నామని అంటున్నారు.
‘ఉదయం నాలుగు గంటల నుంచి వరద నీరు ఇళ్లల్లోకి వచ్చింది. ఊరు మొత్తం జలదిగ్బంధంలో ఉంది. ఊరు చుట్టూ నీళ్లే ఉన్నాయి. ఊర్లోకి వచ్చే రోడ్డు మార్గాలు లేవు. బోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. హెలికాప్టర్ ద్వారా మాత్రమే కాపాడాల్సి ఉంటుందని’ స్ధానిక నాయకుడు ఒకరు తెలిపారు. తాము ఈ విషయాన్ని తెల్లవారుజామునే స్థానిక ఎమ్మెల్యేకు, డయల్ హండ్రెడ్ కు, భూపాలపల్లి, ములుగు జిల్లాల రెస్క్యూ టీంకు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించామని తెలిపారు. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్డీఆర్ఎఫ్ బృందం కాసేపట్లో భూపాలపల్లి చేరుకోనుంది.