పేపర్ లీక్ కేసు.. ఉద్యోగాల్లోంచి రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్‌ల తొలగింపు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులు రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్‌లను ఉద్యోగాల్లోంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 
 

renuka and her husband remove from service due to tspsc paper leak case

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇద్దరు ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. పేపర్ లీక్ నిందితులు రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్‌లను ఉద్యోగాల్లోంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేణుక వనపర్తి జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుండగా.. ఆమె భర్త డాక్యా నాయక్‌ వికారాబాద్ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పేపర్ లీక్ కేసు నేపథ్యంలో వీరిద్దరిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

కాగా.. ఈ కేసులో కీలక నిందితుడు రాజశేఖర్ మరికొందరికీ పేపర్ ఇచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు వాట్సాప్ చాట్‌ను సిట్ రిట్రీవ్ చేసింది. ఈ క్రమంలో గ్రూప్ 1 పేపర్‌ను చాలా మందికి సర్క్యూలేట్ చేసినట్లు గుర్తించారు. రాజశేఖర్, ప్రవీణ్, రేణుకలను విడివిడిగా విచారించారు అధికారులు. వీరి ముందు చాట్ డేటా పెట్టి ప్రశ్నలు సంధించారు. ప్రవీణ్ రాజశేఖర్‌లు కలిసే పేపర్ లీక్ చేసినట్లు ఈ సందర్భంగా గుర్తించారు. రెండు కంప్యూటర్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు అధికారులు. అంతేకాకుండా ఐదు పేపర్లకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ చాట్‌లో గుర్తించారు అధికారులు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

Also Read: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ : నిందితుల ఇళ్లలో సిట్ సోదాలు

ఇక, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్, సిస్టమ్ అనలిస్ట్ రాజశేఖర్‌లు గత అక్టోబరు నుంచే పలు పరీక్షలకు ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. కమిషన్ కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ దొంగిలించడం ద్వారా ప్రశ్నాపత్రాలను పెన్ డ్రైవ్‌లో కాపీ చేసినట్టుగా రాజశేఖర్ చెప్పినప్పటికీ.. అందులో నిజం లేదని అధికారులు నిర్దారణకు వచ్చినట్టుగా సమాచారం. అధికారుల దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే నిందితులు ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)  ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పరీక్షను రద్దు చేయగా.. శుక్రవారం రోజున గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా బోర్డు ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం నివేదిక‌తో తమ అంతర్గత విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios