హైదరాబాద్: తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ఘంగా ఉన్నానని, హుజూరాబాద్ ప్రజలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. కేసీఆర్ టీఆర్ఎస్ బీ ఫారం ఇచ్చారు కాబట్టి తాను రాజీనామా చేయాలని అడగవచ్చునని, కానీ తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఓసారి తన నియోజకవర్గం ప్రజలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయ చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రం వస్తుందనీ... తాము ఎమ్మెల్యేలమూ మంత్రులమూ అవుతామని కేసీఆర్ తో రాలేదని, తెలంగాణ ప్రజల కోసం వచ్చామని, 19 ఏళ్ల పాటు కేసీఆర్ తో కలిసి నడిచానని ఆయన చెప్పారు.  తనకు సంబంధంలేని భూములపై తన మీద ఎలా విచారణ జరుపుతారని ఆయన అన్నారు. జమున హాచరీస్ చైర్మన్ గా తన బార్య ఉన్నారని అన్నారు. తాను టీఆర్ఎస్ లో చేరిన తర్వాత తన భార్య,కుమారుడు, బంధువులు మాత్రమే వ్యాపారాలు చేశారని ఆయన చెప్పారు.

తన భూములపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివాన్ కమిటీ వేశారని, అది నివేదిక ఇచ్చిందని, ఆ విషంయం కేసీఆర్ కు చెప్పానని ఆయన అన్నారు.  ఏ విషయంలో తనపై కేసీఆర్ ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో తెలియదని ఆయన అన్నారు. ఈటెల రాజేందర్ పార్టీలో ఉండబోరని ప్రచారం చేస్తూ వచ్చారని ఆయన అన్నారు. 

తనకు నోటీసులు ఇవ్వకుండా, తాను లేకుండా ఎలా విచారణ చేస్తారని ఆయన అన్నారు. అసైన్డ్ భూముల ఆక్రమణ జరిగితే పంచుల సమక్షంలో విచారణ చేస్తారని, పెద్ద యెత్తున పోలీసులను మోహరించి ఎలా విచారణ జరుపుతారని ఆయన అన్నారు. తప్పు చేసినట్లు ప్రభుత్వం భావిస్తోందని, తాను తప్పు చేయలేదని ఆయన అన్నారు. 

తనకు ఒక్క నోటీసైనా ఇచ్చారా, ముఖ్యమంత్రిగారూ... అని ఆయన అడిగారు. అధికారులు ఇచ్చిన నివేదికలో అన్నీ తప్పులే ఉన్నాయని ఆయన చెప్పారు. అధికారం ఉంది కాబట్టి తనపై కేసు పెట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. 

సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి...

తన సంపాదనపై, ఆస్తులపై, వ్యాపారాలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణలో తాను తప్పు చేసినట్లు తేలితే శిక్షకు సిద్ధమని ఆయన అన్నారు. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తే సమాజం సహించదని ఆయన అన్నారు. 

మీరు చెప్పిందని అధికారులు చేస్తారని ఆయన అన్నారు. కలెక్టర్ తనకు నివేదిక ఇవ్వలేదని, తనకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు. అధికారులతో మీరు మాట్లాడించినట్లుగా తెలుస్తోందని ఆయన అన్నారు. 

తనను బర్తరఫ్ చేసే అధికారం కేసీఆర్ కు ఉందని ఆయన చెప్పారు. కారు గుర్తు మీద గెలిచాను కాబట్టి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేయాలని అనవచ్చునని, హుజూరాబాద్ ప్రజలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.