హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు టీ కాంగ్రెస్ ప్రచారకమిటీ చైర్మన్ విజయశాంతి. ఎల్లకాలం తామే అధికారంలో ఉంటాం అనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తప్పుమీద తప్పు చేస్తోందని మండిపడ్డారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పులు శిశుపాలుడి తప్పుల్ని మించిపోతున్నాయన్నారు. మంది బలంతో తాము ఏం చేసినా చెల్లుతుందనే బరితెగింపుతో టీఆర్ఎస్ అధిష్టానం చేస్తున్న అరాచకాలను చూసి తెలంగాణ ప్రజలంతా రగిలిపోతున్నారని విమర్శించారు. 

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కుడు గారు చేస్తున్న ఆమరణ దీక్ష ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కొత్త చర్చకు దారి తీసిందన్నారు. రాజ్యగబద్ధంగా కాంగ్రెస్ పార్టీకి సంక్రమించిన ప్రతిపక్ష హోదాను దౌర్జన్యంగా లాక్కోవడం మీద నిరసన వ్యక్తం చేస్తూ భట్టి విక్రమార్కుడు నిరసనకు దిగడం తెలంగాణ సమాజాన్ని  కదిలించిందని, కలచివేసిందన్నారు. 

ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం మీదే టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిసారిస్తున్నారు కానీ తెలంగాణకు సంబంధించిన ప్రధాన సమస్యల మీద ఆయన దృష్టి పెట్టిన దాఖలాలు కనిపించడం లేదన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు దాటిపోతున్నా ఇంకా పరిష్కారం కాని సమస్యలు అలాగే మిగిలి ఉన్నాయని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయకపోవడం శోచనీయమన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రతి సందర్భంలోనూ ఇతర రాజ్యాంగ వ్యవస్థలు తమ వంతు పాత్ర పోషించినా, పోషించక పోయినా చివరకు ప్రజలే తగిన తీర్పునివ్వడం ఆనవాయితీ అన్నారు. 

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విజయశాంతి ప్రస్తావించారు. వైసీపీ ఎమ్మెల్యేల భేటీలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనకు గుర్తుకు వస్తున్నాయంటూ కొన్ని వ్యాఖ్యలు చెప్పుకొచ్చారు.  

అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను తన వైపుకు లాక్కొని చంద్రబాబు నాయుడు సంబర పడ్డారని...దేవుడు రాసిన స్క్రిప్ట్ తో ఆయన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి తగిన శాస్తి జరిగిందని  జగన్ మోహన్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. 

జగన్ మోహన్  రెడ్డి చెప్పింది నిజమైతే ఏపీలోనే కాదు తెలంగాణాలో కూడా టిఆర్ఎస్ హైకమాండ్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరుపై దేవుడు త్వరలోనే స్క్రిప్ట్ రాస్తాడని అభిప్రాయపడ్డారు. దాని  పరిణామాలను టిఆర్ఎస్ అనుభవించక  తప్పదంటూ విజయశాంతి శాపనార్థాలు పెట్టారు.   

ఈ వార్తలు కూడా చదవండి

రోజా ఇష్యూ, జగన్ కు విజయశాంతి సూచన, కేసీఆర్ పై ఫైర్