తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముంగిట బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లోకి చేరడం బీఆర్ఎస్‌లో కొత్త భయాలను సృష్టిస్తున్నది. సుమారు నాలుగైదు జిల్లాల్లో గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం.. పొంగులేటి చేరికతో ఆ సామాజిక వర్గం హస్తం పార్టీ వైపు పోలరైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే బీఆర్ఎస్‌కు మింగుడు పడట్లేదు. 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చేరికలు వేగం అందుకుంటున్నాయి. కాంగ్రెస్‌లోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరడం ఖరారైంది. అయితే, ఈ నిర్ణయం అంత ఆషామాషీగా జరగలేదు. పక్కా వ్యూహంతో, సుదీర్ఘ కాలం ఆలోచనలు, చర్చలు, కసరత్తుల తర్వాత పొంగులేటి కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు. అన్ని ఈక్వేషన్లు చూసుకునే ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ఎత్తుగడలు, సామాజిక వర్గం, పార్టీ బలం అన్నీ ఆచీతూచీ ఆలోచనలు చేసిన తర్వాత కాంగ్రెస్‌ను అప్రోచ్ అయ్యారు. పొంగులేటి కాంగ్రెస్ గూటికి వెళ్లాలనే నిర్ణయం వెనుక రామసహాయం సురేందర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్టు తెలిసింది. వరంగల్‌కు చెందిన సురేందర్ రెడ్డి తెర వెనుక చక్రం తిప్పారు. ఆయన ఆలోచనలు, వ్యూహాలు రచించిన తర్వాత పొంగులేటి కాంగ్రెస్‌కు చేరినట్టు తెలుస్తున్నది.

కాంగ్రెస్‌కు ఆది నుంచి రెడ్డి సామాజిక వర్గం పునాదిగా ఉన్నది. నాయకత్వంలో వారిదే ఆధిపత్యం. పార్టీని నిలబెట్టడంలో వారే ప్రధానంగా కనిపిస్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి మొదలు ఉత్తమ్ రెడ్డి, జానా రెడ్డి, జగ్గా రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇలా చాలా మంది రాష్ట్రంలో ఉన్నత నాయకత్వంలో ఉన్నారు. మహబూబ్ నగర్ మొదలు రంగారెడ్డి, వరంగల్, నల్గొండ వరకు పార్టీలో రెడ్డి సామాజిక వర్గమే కీలకంగా ఉన్నది. 

Also Read: వెళ్లిపోయినవారు మళ్లీ వస్తామంటున్నారు.. జాగ్రత్త, షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే : మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో రాజకీయంగానే కాదు.. ఆర్థికంగానూ, ఇతర రంగాల్లోనూ రెడ్డి సామాజిక వర్గం ముందంజలో ఉన్నది. లీడర్‌లే కాదు.. క్యాడర్‌, ఓటర్లు కూడా ఈ వర్గానికి చెందినవారు చాలా మందే ఉన్నారు. అందుకే రెడ్డి సామాజిక వర్గం మొత్తం కాకున్నా.. మెజార్టీగా కాంగ్రెస్ వైపు మొగ్గితే హస్తం పార్టీ అనూహ్య ఫలితాలను సాధించి తీరుతుందని విశ్లేషకులు చెబుతారు. పొంగులేటి చేరికతో రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరిస్తున్నారు. ఈ అంశమే బీఆర్ఎస్‌ను కలవరపెడుతున్నది.

ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్లడం ఆ పార్టీకి ఎంతో ప్రాధాన్యత గల అంశం. పొంగులేటికి ఖమ్మంలోనే కాదు, ఇతర జిల్లాల్లోని వేరే పార్టీలకు చెందిన రెడ్డి సామాజిక వర్గ నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే పొంగులేటి చేరిక అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌లో నూతన జవసత్వాలను నింపుతాయని చెబుతున్నారు.