హైదరాబాద్: కీసర ఆర్డీవో, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు వీర విధేయుడిగా పేరు పొందారు. కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టిన రెవెన్యూ సంస్కరణలకు ఆయన బేషరతుగా మద్దతు తెలిపారు కూడా. 

కీసర ఆర్డీవోగా ఉన్న లచ్చిరెడ్డిని బదిలీ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం)గా నియమించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

లచ్చిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అండమాన్ నికోబార్ దీవుల పర్యటనలో ఉన్న సమయంలో బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. రెండేళ్లుగా లచ్చిరెడ్డి కీసరలో పనిచేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ల అధికారాలను తాహిసిల్దార్లకు కట్టబెట్టకూడదని రెండేళ్ల క్రితం తాహిసిల్దార్లంతా కోరిన సమయంలో లచ్చిరెడ్డి ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ప్రకటన చేశారు. 

దాంతో కేసీఆర్ నేరుగా లచ్చిరెడ్డితో ఫోన్ లో మాట్లాడి ఆయనకు కీసర ఆర్డీవో పోస్టింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఆయన కేసీఆర్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో తేదలుచుకున్న సంస్కరణలకు మద్దతు పలుకుతూ వస్తున్నారు. ఆర్టీసి సమ్మె నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లచ్చిరెడ్డి రెవెన్యూ ఉద్యోగులను కూడగడుతున్నారనే అనుమానంతోనే బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ తాహిసీల్దార్ల సంఘం (టీజిటీఎ) ఇటీవల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ (ట్రెసా)లో విలీనం అవుతున్న సమయంలో ఆ విలీనం పూర్తి కాకుండా లచ్చిరెడ్డి అడ్డుకున్నారు. తాహిసీల్దార్ల సంఘం ఉండాల్సిందేనని కొంత మందితో కలిసి ఆయన డిప్యూటీ కలెక్టర్ల సంఘాన్ని ఏర్పాటు చేశారు. 

ఇటీవల నిజామాబాద్ అర్బన్ తాహిసీల్దార్ జ్వాలా గిరి రావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో లచ్చిరెడ్డి రెవెన్యూ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. సంతాప సభ నిర్వహించాలని అనుకున్నారు. దీంతో లచ్చిరెడ్డిపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనకు కేసీఆర్ ఆ మధ్య కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఈటల రాజేందర్ లచ్చిరెడ్డికి లీక్ చేశారని అనుమానిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఆందోళనకు సమాయత్తం కావాలని ఈటల లచ్చిరెడ్డికి సూచించినట్లు ప్రభుత్వ అనుకూల పత్రికల్లో వార్తాకథనాలు కూడా వచ్చాయి. దీన్ని కూడా కేసీఆర్ మనసులో పెట్టుకున్నట్లు చెబుతున్నారు.  

అయితే, కొత్త పోస్టింగ్ లో చేరకూడదని లచ్చిరెడ్డి నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెవెన్యూ సంఘాలతో కలిసి పోరాటం చేయాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.