పాల్వంచ: ఇన్సూరెన్స్ పాలసీ డబ్బుల కోసం సమీప బంధువునే  ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడే దారుణంగా హతమార్చిన ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో  చోటు చేసుకొంది.  ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోతు రాజువాల్, రాధా భార్యభర్తలు. రాజువాల్ ఆశ్వాపురం మండలం వెంకటాపూరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు.  ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తూనే ఎల్ఐసీ ఏజంట్‌గా కూడ ఆయన పనిచేస్తున్నాడు. 

అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తన బంధువుల తరపున కూడ ఆయనే పాలసీ ప్రీమియం డబ్బులను చెల్లించేవాడు.  దీని వెనుక  ఆయన దురుద్దేశం ఉందని  విచారణలో పోలీసులు కనిపెట్టారు.

ఇదిలా ఉంటే  పాల్వంచలోని కరకవాగుకు చెందిన  భూక్య రాయుడుకు  ఇద్దరు భార్యలు. వీరిలో నీలా మొదటి భఆర్య, బద్రి  రెండో భార్య.  రాజువాల్ భార్యకు బద్రి చెల్లెలు అవుతోంది.  చాలా ఏళ్లుగా రాయుడు రెండో భార్యతోనే ఉంటున్నాడు. 

గత  ఏడాదిఅక్టోబర్ 17వ తేదీన కరకవాగు శివారులో మేకలను కాసేందుకు వెళ్లి కిన్నెరసాని కాల్వలోపడి అతను మరణించాడు.  ఈ విషయమై  భార్య బద్రి మృతి మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.

అతిగా మద్యం సేవించడం వల్లే నీటిలో పడి మరణించినట్టుగా పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఆ తర్వాత భీమా సొమ్ము  కోసం అవసరమైన కార్యక్రమాలను పూర్తి చేశారు. భీమా సొమ్మును రాయుడు రెండో భార్య బద్రి, భీమా ఏజంట్లు పంచుకొన్నారు. రాయుడు  రెండో భార్య పేరున 17 పాలసీలు ఉన్నాయి. మొదటి భార్య పేరున మూడు పాలసీలు ఉన్నాయి.

రెండు మాసాల క్రితం రాయుడుమొదటి భార్య వద్దకు  ఏజంట్లు వచ్చారు. ఇదే విషయమై రాయుడు మొదటి భార్య పోలీసుల వద్ద తన అనుమానాన్ని వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు ఈ కోణంలో విచారణ జరిపారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.

రాయుడి పేరున రూ. 1.35 కోట్ల భీమా పరిహారం సొమ్ముపై కన్నేసిన భార్యభర్తలు రాజువాల్, రాధ పథకం ప్రకారంగా అతడిని హత్య చేయాలని  భావించారు. రాయుడు మద్యానికి బానిస కావడంతో వారికి అతడిని హత్య చేయడం చాలా సులభంగా మారింది. 

రాయుడుకు మద్యం  తాగించి కిన్నెరసాని  కాల్వలో తోసివేయడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటనలో రాజువాల్‌కు సహకరించిన భార్య రాధ ఆటో డ్రైవర్ వెంకటకృష్ణ,  బంధువు బోడా కృష్ణలను కూడ పోలీసులు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.