14 రోజుల పాటు రిమాండ్‌లో భాగంగా చంచల్ గూడ జైలుల్లో రవిప్రకాష్ ఉన్నాడు. సాధారణ ఖైదీల మాదిరిగానే రవిప్రకాష్ కృష్ణా బ్యారక్ లో శనివారం రాత్రి గడిపాడు.
హైదరాబాద్: నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టైన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ శనివారం రాత్రి సాధారణ ఖైదీగా చంచల్‌గూడ జైలులో గడిపారు. కృష్ణా బ్యారక్‌లో రవిప్రకాష్ గడిపాడు. ఈ నెల 18వ తేదీ వరకు రవిప్రకాష్ కు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను శనివారం నాడు రాత్రి చంచల్ గూడ జైలుకు తరలించారు.
రవిప్రకాష్ ను అండర్‌ట్రయల్ ఖైదీగా పరిగణించి 4412 నెంబర్ ను కేటాయించారు. ఇటీవల ఏసీబీ కేసులో అరెస్టైన నిందితులతో పాటే రవిప్రకాష్ కూడ ఉన్నారు. శనివారం నాడు రాత్రంతా రవిప్రకాష్ సరిగా నిద్రపోలేదని జైలు అధికారులు చెప్పారు. రవిప్రకాష్ ఎవరితో మాట్లాడకుండా జైలు సెల్‌లోనే ఉన్నారని జైలు అధికారులు తెలిపారు.
ఆదివారం నాడు ఉదయం రవిప్రకాష్ కు బ్రేక్ ఫాస్ట్ గా కిచిడీ ఇచ్చారు. అయితే కిచిడీని కొంత మాత్రమే తిని మిగిలిన కిచిడీని వదిలివేసినట్టుగా తెలుస్తోంది. రవిప్రకాష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఈ నెల 9వ తేదీన జరుగుతాయి. బెయిల్ పిటిషన్ పై కోర్టు నిర్ణయం తీసుకొనేవరకు రవిప్రకాష్ చంచల్ గూడ జైల్లోనే కొనసాగే అవకాశం ఉంది.
టీవీ 9 ను అలందా మీడియా సంస్థ కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థలో అనేక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కొత్త యాజమాన్యానికి రవిప్రకాష్ సహకరించకుండా వ్యవహరించినట్టుగా కొత్త యాజమాన్యం ప్రకటించింది. అంతేకాదు నిధులను దుర్వినియోగం చేశారనే కారణంగా రవిప్రకాష్ ను టీవీ9 సంస్థ నుండి తొలగించారు. అంతేకాదు ఆయనపై కేసులు కూడ పెట్టారు.
ఈ కేసు విచారణలో భాగంగా రూ. 18 కోట్ల నిధులను డైరెక్టర్లకు చెప్పకుండానే రవిప్రకాష్ , సీఎప్ఓ మూర్తి దారి మళ్లించారని కొత్త యాజమాన్యం ఆరోపిస్తోంది.ఈ కేసులోనే రవిప్రకాష్ ను అరెస్ట్ చేశారు.
