Asianet News TeluguAsianet News Telugu

సిఎం రమేష్ తాగే వాటర్ బాటిల్ ఖరీదు రూ.3 వేలు

కడప: కడప ఉక్కు కర్మాగారం కోసం నిరవధిక దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విరుచుకుపడ్డారు.

Ravindranath Reddy comments on CM ramesh's fast

కడప: కడప ఉక్కు కర్మాగారం కోసం నిరవధిక దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విరుచుకుపడ్డారు. సీఎం రమేష్‌ తాగే వాటర్‌ బాటిల్‌ ఖరీదు మూడు వేల రూపాయలు ఉంటుందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే సిఎం రమేష్ దీక్ష జరుగుతోందని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిందని విమర్శించారు. టీడీపీ దీక్షకు అధికారులను, ఉద్యోగులను తరలించడం ఏమిటని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలు చేస్తోంది నిరాహార దీక్ష కాదని నయవంచన దీక్ష అని వ్యాఖ్యానించారు. 

సాధారణ ప్రజలు 10 రోజుల పాటు దీక్షచేయలేరని, అలాంటిది బీపీ, షుగర్‌ ఉన్న సీఎం రమేష్‌ ఎలా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉక్కు పరిశ్రమ కోసం అఖిల పక్షం ఆధ్వర్యంలో జిల్లా బంద్‌ చేపట్టామని ఆయన చెప్పారు.

ఓట్ల కోసమే జిల్లా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, టీడీపీ నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్‌ బాబు విమర్శించారు. పార్లమెంట్‌లో ఏరోజు కూడా ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడని సీఎం రమేష్‌ దీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. 10 రోజులుగా దీక్ష చేస్తున్నా ఎంపీ చలాకీగా ఉండటం వెనుక రహస్యాన్ని వెల్లడించాలని, ఆయన ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయాలని సురేష్ బాబు  డిమాండ్‌ చేశారు. 

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం సీఎం చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం ఇష్టం లేదని కడప ఎమ్మెల్యే అంజాద్‌ బాషా ఆరోపించారు. కడప నగరంలో తెలుగుదేశం పార్టీ హైడ్రామా ఆడిస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం రమేష్‌ కార్పొరేట్‌ దీక్ష చేస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లుగా సీఎం రమేష్‌, చంద్రబాబు రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. 

రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మోసంలో టీడీపీ, చంద్రబాబులకు కూడా భాగం ఉందని అన్నారు. తాము సమైక్య ఉద్యమంలో ఏడవరోజే అలసిపోయామని గుర్తు చేస్తూ కానీ సీఎం రమేష్‌ మాత్రం ఎలా ఉన్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీక్ష చేస్తున్న నాయకులను పరామర్శించడానికి సీఎం ఏ రోజు వస్తారో ముందే చెబుతున్నారని, వారి దీక్షలను ఎలా నమ్మాలని నిలదీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios